రాజమౌళి హాలీవుడ్ ఎంట్రీకి రెడీనా? వారణాసి తర్వాత భారీ ప్లాన్!
దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి హాలీవుడ్లో సినిమా చేయబోతున్నారా? ప్రస్తుతం టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు ఈ విషయంపై ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి.. హాలీవుడ్ నుంచి తనకు పలు సినిమా ఆఫర్లు వచ్చినట్లు వెల్లడించారు. అంతేకాదు, హాలీవుడ్లో కనీసం ఒక్క సినిమాకైనా దర్శకత్వం వహించాలనేది తన కోరిక అని తెలిపారు.
బ్రెజిల్లో జరిగిన 50వ సావో పాలో అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొన్న రాజమౌళి ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హాలీవుడ్ సినిమా నిర్మాణ విధానాలు, అక్కడి పని తీరు నుంచి తాను ఎంతో నేర్చుకోవాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత వచ్చిన ఆఫర్లను వెంటనే అంగీకరించలేదట. అప్పటికే మహేశ్ బాబుతో తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు ప్రారంభం కావడంతో, ప్రస్తుతం ఈ ప్రాజెక్టుపైనే పూర్తి దృష్టి పెట్టినట్లు తెలిపారు.
ఇక మహేశ్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘వారణాసి’ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారీ యాక్షన్, అడ్వెంచర్ అంశాలతో రూపొందుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా పూర్తయిన తర్వాత హాలీవుడ్ నుంచి వచ్చిన ఆఫర్లను పరిశీలిస్తానని రాజమౌళి చెప్పడంతో, ఆయన తదుపరి ప్రాజెక్ట్‌పై ఆసక్తి మరింత పెరిగింది.
మొత్తానికి ‘ఆర్ఆర్ఆర్’తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి.. ‘వారణాసి’ తర్వాత హాలీవుడ్లో అడుగుపెడతారా? అక్కడి ప్రేక్షకుల కోసం ఓ భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తారా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దీనిపై అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే!








