మెగాస్టార్ చిరంజీవి వయసు పెరుగుతున్నా కూడా తన జోష్ మాత్రం ఏమాత్రం తగ్గించడం లేదు. వరుస సినిమాలతో అభిమానులను అలరిస్తూనే ఉన్నారు. అయితే ఆయన చేస్తున్న అన్ని ప్రాజెక్టుల కంటే కూడా అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా మాత్రం ‘విశ్వంభర’. సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ భారీ చిత్రం ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా, పలుమార్లు వాయిదా పడుతూ వస్తోంది. ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్ పనుల కారణంగానే ఈ సినిమా రిలీజ్ ఆలస్యం అవుతోందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
ఇలాంటి సమయంలో అభిమానులను ఉత్సాహపరిచే ఓ ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే.. ‘విశ్వంభర’ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నారట. ఇటీవల స్టార్ హీరోల సినిమాలు రెండు పార్ట్స్‌గా వచ్చి భారీ విజయాలు సాధిస్తున్న నేపథ్యంలో, ఇదే ఫార్ములాను ‘విశ్వంభర’కు కూడా అనుసరించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్న అభిమానులు, ఇప్పుడు ఈ వార్తతో మరింత ఎగ్జైట్ అవుతున్నారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రావాల్సి ఉంది.
ఈ సినిమాలో హీరోయిన్గా త్రిష నటిస్తుండగా, దర్శకుడు వశిష్ట అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఆస్కార్ విజేత M. M. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. అత్యాధునిక గ్రాఫిక్స్‌తో రూపొందుతున్న ఈ సినిమా విడుదల తేదీపై మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.
ఇక చిరంజీవి ఇతర సినిమాల విషయానికి వస్తే.. ఈ ఏడాది దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన సినిమాతో సంక్రాంతి బరిలోకి వచ్చి మంచి విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం అదే ఊపులో దర్శకుడు శ్రీకాంత్ దర్శకత్వంలో ఓ యాక్షన్ గ్యాంగ్‌స్టర్ డ్రామాకు సిద్ధమవుతున్నారు. మరోవైపు దర్శకుడు బాబీ తో ‘మెగా 158’ వర్కింగ్ టైటిల్‌తో మరో సినిమా చేస్తున్నారు. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన వాల్తేర్ వీరయ్య బ్లాక్‌బస్టర్ కావడంతో, ఈ కొత్త ప్రాజెక్టుపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఏడు పదుల వయసులో కూడా విభిన్నమైన కథలు, కొత్త జానర్లను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్న చిరంజీవి.. ‘విశ్వంభర’తో ఎలాంటి మాయ చేస్తారో చూడాలి.








