గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్-ఇండియా చిత్రం ‘పెద్ది’ విడుదల తేదీలో మార్పు చోటుచేసుకుంది. తొలుత ఈ సినిమాను మార్చి 27న విడుదల చేయాలని చిత్ర బృందం నిర్ణయించింది. అయితే, పవన్ కళ్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం మార్చి 26న విడుదల కానున్నట్లు ప్రకటించడంతో, బాబాయ్ సినిమాతో పోటీని నివారించేందుకు రామ్ చరణ్ తన సినిమాను వెనక్కి జరిపారు. ఇప్పుడు ‘పెద్ది’ చిత్రాన్ని ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురానున్నట్లు దర్శకుడు అధికారికంగా ప్రకటించారు.
ఈ కొత్త విడుదల తేదీ సినిమా వసూళ్ల పరంగా బాగా కలిసి వస్తుందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఏప్రిల్ 30న సినిమా విడుదల కావడం వల్ల, మే 1న వచ్చే ‘మే డే’ సెలవు దినం మరియు ఆ తర్వాతి వీకెండ్ చిత్రానికి పెద్ద ప్లస్ కానున్నాయి. సమ్మర్ హాలిడేస్ కూడా తోడవ్వడంతో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించే అవకాశం ఉంది. “అతడి రాక తేదీ మారుతుంది, కానీ అతడి దృఢ సంకల్పం మారదు” అంటూ చిత్ర యూనిట్ విడుదల చేసిన ప్రకటన సోషల్ మీడియాలో అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
గ్రామీణ క్రీడా నేపథ్యంతో కూడిన యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ ఒక శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్, జగపతి బాబు వంటి హేమాహేమీలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ సమర్పిస్తోంది.









