Search
Close this search box.

  iBOMMA రవి అరెస్ట్‌పై టాలీవుడ్ ప్రముఖుల హర్షం

మూవీ పైరసీ వెబ్‌సైట్ నిర్వాహకుడైన iBOMMA రవి అరెస్ట్‌పై టాలీవుడ్ సినీ పరిశ్రమ ఫుల్ హ్యాపీగా ఉంది. ఇండస్ట్రీని వెంటాడుతోన్న పైరసీ భూతానికి చెక్ పెట్టారంటూ ప్రముఖ హీరోలు చిరంజీవి, నాగార్జున, దర్శకుడు రాజమౌళి సహా పలువురు సినీ ప్రముఖులు తెలంగాణ పోలీసులను ప్రత్యేకంగా ప్రశంసించారు. నాగార్జున మీడియాతో మాట్లాడుతూ, తన కుటుంబంలో కూడా ఒక ‘డిజిటల్ అరెస్ట్’ జరిగిందని, రెండు రోజుల పాటు తమ కుటుంబంలో ఒకరిని నిర్బంధించారని తెలిపారు. పైరసీ వెబ్‌సైట్లు ఒక పెద్ద ఉచ్చు (బిగ్ ట్రాప్) అని హెచ్చరించిన నాగ్, ఇది కేవలం రూ.20 కోట్ల కోసం కాదని, పైరసీ వెనుక అంతర్జాతీయ ముఠా ఉందని, రూ.వేల కోట్లు దోచుకునే ప్లాన్ ఉందని, 50 లక్షల మంది సబ్‌స్క్రైబర్ల డేటా వారికి చేరిందని స్పష్టం చేశారు.

మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ, లైట్ బాయ్ దగ్గర నుంచీ స్టార్ హీరోస్, డైరెక్టర్ల వరకూ లక్షల మంది ఇండస్ట్రీపై ఆధారపడి జీవిస్తున్నారని గుర్తు చేశారు. ఎన్నో ఏళ్లుగా పైరసీ నుంచి ఎలా తప్పించుకోవాలో ఆలోచిస్తున్నామని, ఇండస్ట్రీ కష్టాన్ని దౌర్జన్యంగా దోచుకోవడం… తిరిగి పోలీసులకే సవాల్ చేయడాన్ని తట్టుకోలేకపోయామని అన్నారు. ఈ కేసులో శ్రమించి నిందితుడిని పట్టుకున్న ప్రస్తుత సీపీ సజ్జనార్‌తో పాటు గత సీపీ సీవీ ఆనంద్‌కు ధన్యవాదాలు తెలిపారు. సినిమాను ప్రజలు కూడా తమదిగా భావించి, పైరసీ మూవీస్ చూడకుండా థియేటర్లలోనే చూడాలని విజ్ఞప్తి చేశారు. త్వరలో రాజమౌళి తీయనున్న గొప్ప మూవీకి కూడా పైరసీ పెద్ద సవాల్ అవుతుందని పేర్కొన్నారు.

దర్శకధీరుడు రాజమౌళి iBOMMA రవి అరెస్ట్‌ను సినిమాలో ‘సూపర్ హిట్ సీన్‌’లా ఉందని, ‘విలన్ ఛాలెంజ్ చేస్తే 2 నెలల తర్వాత హీరో అతన్ని కటకటాల వెనక వేసినట్లు’ ఉందని అన్నారు. ‘పోలీసులతో ఆటలొద్దు. భస్మాసురుడి హస్తంలా తన తలమీద తనే చేయి పెట్టుకున్నాడు’ అని రవిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఏదీ ఉచితంగా రాదని, అలా వస్తే దాని వెనుక పెద్ద ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు. పైరసీ చేసే వాళ్లు సంఘ సేవ చేయడం లేదని, పెద్ద పెద్ద సర్వర్లు ఉపయోగించి పైరసీ చేస్తూ ప్రజల వ్యక్తిగత డేటాను క్రిమినల్స్‌కు అమ్ముతున్నారని, ఉచితంగా సినిమాలు చూసి ఇబ్బందుల్లో పడొద్దని సూచించారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు