ప్రభాస్ కథానాయకుడిగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం ఇండియన్ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్‌లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమా 1100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి, తెలుగు సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 5 చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. అయితే, ఈ ‘కల్కి’ టైటిల్‌తో సినిమా తీయాలనేది ప్రభాస్ తండ్రి, దివంగత నిర్మాత ఉప్పలపాటి సూర్యనారాయణ రాజు గారి కల. ఈ చిత్రం ద్వారా ప్రభాస్ తన తండ్రి ఆగిపోయిన సినిమా కలను నెరవేర్చడం విశేషం.
ప్రభాస్ తండ్రి సూర్యనారాయణ రాజు గారు 1989-90 సమయంలో కొత్త నటీనటులు, సాంకేతిక నిపుణులతో ‘కల్కి’ అనే సినిమాను ప్రయోగాత్మకంగా నిర్మించాలని ప్లాన్ చేశారు. ఈ చిత్రానికి కో-డైరెక్టర్‌గా పనిచేసిన సునీల్ వర్మకు దర్శకత్వం అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అంతేకాకుండా, అప్పటికి సంగీత దర్శకుడిగా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న కీరవాణిని ఈ సినిమాతోనే పరిశ్రమకు పరిచయం చేయాలనుకున్నారు. నటీనటుల ఎంపిక పూర్తయి, కొంత భాగం షూటింగ్ కూడా జరిగిందట.
అయితే, కొన్ని కారణాల వల్ల ఆ ‘కల్కి’ సినిమా నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది. సూర్యనారాయణ రాజు గారు దానిని పూర్తి చేయడానికి ఎంత ప్రయత్నించినా ఫలించక, చివరకు ఆ ప్రాజెక్టును పక్కన పెట్టేశారు. చివరికి, ప్రభాస్ అదే ‘కల్కి’ టైటిల్‌తో సినిమా చేయడమే కాక, భారీ విజయాన్ని సాధించి, తండ్రి కలను నెరవేర్చారు. ఆ రోజు ‘కల్కి’తో పరిచయం కావాల్సిన కీరవాణి ‘మనసు మమత’తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. సూర్యనారాయణ రాజు గారు అంతకుముందు కృష్ణంరాజుతో కలిసి ‘బొబ్బిలి బ్రహ్మన్న’, ‘తాండ్ర పాపారాయుడు’, ‘త్రిశూలం’ వంటి పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించారు.









