జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత కొంతకాలంగా రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. దాంతో సినిమాలకు కాస్త దూరమయ్యారు. అయితే ఇప్పుడు పరిస్థితులు మారాయి. రాజకీయాలతోపాటు సినిమాలను కూడా సమాంతరంగా కొనసాగించే నిర్ణయం తీసుకున్న పవన్, వరుస ప్రాజెక్టులను లైన్‌లో పెట్టడంతో అభిమానుల్లో మళ్లీ ఆనందం నెలకొంది.
తాజాగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఓజీ (OG)’ సినిమా భారీ విజయాన్ని నమోదు చేసింది. బాక్సాఫీస్ వద్ద 300 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన ఈ సినిమా, పవన్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచింది. ఈ విజయంతో ఉత్సాహం పెరిగిన పవన్ కళ్యాణ్, ‘ఓజీ యూనివర్స్’ అనే కొత్త కాన్సెప్ట్‌ను ప్రకటించారు. ఇందులో సీక్వెల్, ప్రీక్వెల్ సినిమాలు కూడా ఉండనున్నాయని వెల్లడించారు.
ఇప్పుడు టాలీవుడ్‌లో వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం, ప్రముఖ నిర్మాత దిల్ రాజు (Dil Raju) పవన్ కళ్యాణ్‌తో మరోసారి సినిమా చేయాలని యోచిస్తున్నారట. ఈ కాంబినేషన్‌లో వచ్చిన ‘వకీల్ సాబ్ ’ ఘన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వీరిద్దరి మధ్య ఎలాంటి సినిమా రాలేదు. కానీ ఇప్పుడు ఆ జోడీ మళ్లీ కలిసే అవకాశం ఉందని టాక్.
ఈ కొత్త ప్రాజెక్ట్‌కు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. హిట్ సినిమాల స్పెషలిస్ట్‌గా పేరుగాంచిన అనిల్ రావిపూడి ఇప్పటివరకు ప్రేక్షకులను నిరాశపరచలేదు. అందుకే ఈ కాంబినేషన్ సెట్ అయితే అది పవన్ కెరీర్‌లో మరో బ్లాక్‌బస్టర్‌గా నిలుస్తుందని అభిమానులు నమ్ముతున్నారు..









