ప్రస్తుతం యువతకు వడ్డే నవీన్ అనే పేరు అంత పరిచయం లేకపోయినా, ఒకప్పుడు ఆయన తెలుగుసినిమా ఇండస్ట్రీలో వెలుగులు విరజిమ్మిన హీరో. ఇప్పుడు, ఇన్నేళ్ల తర్వాత ఈ మాజీ హీరో రీఎంట్రీ ఇస్తూ మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అంతేకాదు, తన రీఎంట్రీ కోసం ప్రత్యేకంగా “వడ్డే క్రియేషన్స్” అనే బ్యానర్‌ను కూడా స్థాపించాడు.
ఈ బ్యానర్‌పై హీరోగా నటిస్తున్న మొదటి ప్రాజెక్ట్‌కే “త్రిమూర్తులు” అనే టైటిల్ ఫిక్స్ అయింది. ఈరోజు విడుదలైన ఫస్ట్ లుక్‌లో, వడ్డే నవీన్ ఖాకీ డ్రెస్సులో, లాఠీ చేతబట్టి, చిరునవ్వులు చిందిస్తున్న కానిస్టేబుల్‌గా కనిపిస్తున్నాడు. ఈ రీఎంట్రీ అతనికి ఎంతవరకు సక్సెస్ అందిస్తుందో ఆసక్తిగా మారింది.
గతంలో పెళ్లి సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న వడ్డే నవీన్, ఆ తర్వాత మనసిచ్చి చూడు, స్నేహితులు, చాలా బాగుంది వంటి డీసెంట్ హిట్స్ ఇచ్చాడు. అయితే, ఆ స్థాయి మేజర్ సక్సెస్ దక్కకపోవడంతో కొంతకాలం ఇండస్ట్రీకి దూరమయ్యాడు. ఇప్పుడు ఇన్నేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ కొత్త జోష్‌తో తిరిగి వస్తున్నాడు.ఆసక్తికరమైన విషయం ఏమిటంటే—ఇటీవలే వేణు తొట్టెంపూడి కూడా లాంగ్ గ్యాప్ తర్వాత రీఎంట్రీ ఇచ్చాడు. అప్పుడు వేణు, ఇప్పుడు నవీన్—ఇద్దరూ కానిస్టేబుల్ పాత్రలతోనే రీఎంట్రీ ఇవ్వడం విశేషం..