తమిళంలో వరుస ప్రాజెక్ట్‌లతో జోరు చూపిస్తున్న పూజా హెగ్డే, తెలుగు ప్రేక్షకులను మాత్రం కొంతకాలంగా ఎదురుచూపుల్లో ఉంచుతోంది. దుల్కర్ సల్మాన్ – రవి నేలకుదిటి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాలో ఆమె నటించనుందనే టాక్ వినిపిస్తున్నప్పటికీ, ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు.
ఇదే సమయంలో, పూజా పేరు మరో భారీ తెలుగు సినిమాతో మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది. నితిన్ హీరోగా, క్రియేటివ్ డైరెక్టర్ విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో రాబోయే చిత్రంలో ఆమెను కథానాయికగా తీసుకోవాలని మేకర్స్ సీరియస్‌గా ఆలోచిస్తున్నారని సమాచారం. ఈ విషయంపై ఇప్పటికే పూజాతో చర్చలు ప్రారంభమైనట్లు తెలిసింది.
క్రీడా నేపథ్యంతో తెరకెక్కనున్న ఈ సినిమాలో నితిన్ హార్స్ రైడర్‌గా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇందుకోసం గుర్రపు స్వారీలో ప్రత్యేక శిక్షణ కూడా పొందాడట. చిత్రానికి ‘స్వారీ’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టు టాక్. ప్రస్తుతం పూర్వ నిర్మాణ పనులు వేగంగా సాగుతున్న ఈ ప్రాజెక్ట్, ఏడాది చివర్లో సెట్స్‌పైకి వెళ్లనుంది..