Search
Close this search box.

  భారత ఎన్నికల సంఘం నూతన కమిషనర్‌గా జ్ఞానేశ్ కుమార్..

భారత ఎన్నికల సంఘం నూతన కమిషనర్‌గా జ్ఞానేశ్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు గత రాత్రి వేర్వేరుగా రెండు గెజిట్ నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ప్రస్తుత సీఈసీ రాజీవ్ కుమార్ పదవీ కాలం నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో సంప్రదాయం ప్రకారం ఎన్నికల కమిషనర్లలో సీనియర్ అయిన జ్ఞానేశ్ కుమార్‌ను సీఈసీగా ఎంపిక చేశారు. జ్ఞానేశ్ కుమార్ స్థానంలో ఎన్నికల కమిషనర్‌గా వివేక్ జోషిని ఎంపిక చేశారు. మరో ఈసీగా సుఖ్‌బీర్ సింగ్ ఉన్నారు.

 

అంతకుముందు ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల కమిటీ ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ), ఎన్నికల కమిషనర్ (ఈసీ) పదవులను చేపట్టబోయే వ్యక్తుల పేర్లను ఖరారు చేసింది. త్రిసభ్య కమిటీలో మోదీతోపాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఉన్నారు. కమిటీ చేసిన సిఫార్సును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. ఆ వెంటనే అధికారిక ప్రకటన విడుదలైంది. ఎన్నికల కమిషనర్ల నియామకాలకు సంబంధించి 2023లో తీసుకొచ్చిన చట్టం ప్రకారం చేపట్టిన తొలి ఎంపికలు ఇవే కావడం గమనార్హం.

 

61 ఏళ్ల జ్ఞానేశ్వర్ కుమార్ కేరళ క్యాడర్‌కు చెందిన 1988 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. నిరుడు మార్చిలో ఎన్నికల కమిషనర్‌గా నియమితులయ్యారు. ఆర్టికల్ 370 రద్దు కోసం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బిల్లు రూపొందించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. గతేడాది జనవరిలో సహకార శాఖ కార్యదర్శిగా పదవీ విరమణ చేశారు. సీఈసీగా ఎన్నికైన ఆయన 2029 జనవరి 26 వరకు ఆ పదవిలో కొనసాగుతారు. ఆయన పర్యవేక్షణలోనే ఈ ఏడాది చివరల్లో బీహార్, వచ్చే ఏడాది తమిళనాడు, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇక, ఎన్నికల అధికారిగా నియమితులైన వివేక్ జోషి 1989 హర్యానా క్యాడర్‌కు చెందిన వారు. ప్రస్తుతం ఆయన హర్యానా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు