Search
Close this search box.

  ఏపీలో పురుషుల పొదుపు సంఘం గ్రూప్స్..!

ఏపీలో కూటమి ప్రభుత్వం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు మహిళలకు పొదుపు సంఘాలు ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ పొదుపు సంఘాల ద్వారా ఎందరో మహిళలు, ఆర్థికంగా బలోపేతం అవుతున్నారు. అంతేకాదు పలు సంక్షేమ పథకాలను సైతం పొదుపు సంఘాలలో గల మహిళలకు వర్తిస్తున్నాయని చెప్పవచ్చు. ఈ దశలో కేవలం మహిళలకే పొదుపు సంఘాలను పరిమితం చేయకుండా, పురుషులకు కూడా పొదుపు సంఘాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తక్షణం అమలు చేసేందుకు సైతం రాష్ట్ర వ్యాప్తంగా చర్యలు చేపట్టడంపై, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

 

రాష్ట్రవ్యాప్తంగా తొలిదశలో పురుషుల పొదుపు సంఘాలకు సంబంధించి 2841 గ్రూపులను నెలకొల్పాలని ప్రభుత్వం లక్ష్యంగా ఎంచుకుంది. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ప్రజల నుండి సైతం అనూహ్య స్పందన లభిస్తోంది. నెల రోజుల్లోనే 1028 పురుషుల సంఘాలు ఏర్పడడంతో, మార్చి 31 నాటికి తమ టార్గెట్ ను పూర్తి చేసుకునేలా సంబంధిత అధికారులు యాక్షన్ ప్లాన్ రూపొందించారు. ప్రధానంగా పురుషుల పొదుపు సంఘాల ద్వారా రోజువారి కూలీలకు, భవన నిర్మాణ కార్మికులకు, సెక్యూరిటీ గార్డులకు ఆర్థిక భరోసా కల్పించాలన్నది ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం.

 

అయితే పురుషుల పొదుపు సంఘాలలో ఎవరైనా చేరెందుకు కొన్ని నిబంధనలను ప్రభుత్వం ప్రకటించింది. 18 నుండి 60 ఏళ్ల మధ్యగల వయసు గలవారు అర్హులని, ఐదుగురు పురుషులు కలిసి ఒక గ్రూపుగా ఏర్పాటు కావచ్చు. అలాగే గ్రూప్లో సభ్యుడిగా చేరే వ్యక్తి ఆధార్ కార్డు, రేషన్ కార్డు తప్పనిసరిగా కలిగి ఉండాలి. ప్రతినెలా కనీసం రూ. 100 నుండి రూ. 1000 వరకు పొదుపు చేసే అవకాశం ఈ సంఘానికి కలుగుతుంది. ఆరు నెలల తర్వాత రివాల్వింగ్ ఫండ్ కింద ప్రభుత్వం.. రూ. 25 వేలు అందజేయనుంది. ఆసక్తి కలిగిన పురుషులు స్థానిక మెప్మా కార్యాలయ సిబ్బందిని సంప్రదిస్తే చాలు పురుషుల పొదుపు సంఘం గ్రూపు ఏర్పాటు చేస్తారు. మరెందుకు ఆలస్యం.. పొదుపు సంఘంలో చేరండి.. ఆర్థికంగా బలోపేతం కండి.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు