Search
Close this search box.

  తెలంగాణ సీఎల్పీ సమావేశం… ఈ నెలలో రెండు భారీ బహిరంగ సభలు..

హైదరాబాదులో నేడు తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ సీఎల్పీ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ కులగణన, కేంద్ర బడ్జెట్, పార్టీ గీత దాటుతున్న నేతలు… తదితర అంశాలపై సీఎల్పీలో చర్చించారు.

 

నాయకులు పార్టీ నిర్ణయాలను వ్యతిరేకిస్తే కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. పార్టీ విధానాలపై అనుమానాలు ఉంటే, పార్టీలో అంతర్గతంగా చర్చించాలే తప్ప బహిరంగ వ్యాఖ్యలు చేయరాదని అగ్రనేతలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు స్పష్టం చేశారు.

 

ఇక, స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చిస్తూ… విజయమే లక్ష్యంగా సీనియర్ నేతలు, కొత్త నేతలు సమన్వయంతో సాగాలని పిలుపునిచ్చారు. పాత, కొత్త నేతలు ఒకే మాటపై సాగితేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపును సొంతం చేసుకోగలమని అభిప్రాయపడ్డారు. కులగణనపై విపక్షాలు అపోహలు సృష్టించే విధంగా ప్రచారం చేస్తున్నాయని, దీనిపై ప్రతి కాంగ్రెస్ ఎమ్మెల్యే నియోజకవర్గ స్థాయిలో దీటుగా బదులివ్వాలని స్పష్టం చేశారు.

 

సీఎల్పీ భేటీ ముగిసిన అనంతరం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. ఫిబ్రవరిలో రెండు భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ సభలకు కాంగ్రెస్ హైకమాండ్ నేతలను ఆహ్వానించేందుకు ఢిల్లీ వెళుతున్నామని తెలిపారు. ఇక, ఎమ్మెల్యేలు విందు సమావేశాలు ఏర్పాటు చేసుకోవడంలో తప్పేమీ లేదని అన్నారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు