తెలంగాణ ప్రభుత్వం పథకాల అమలు పై వేగంగా అడుగులు వేస్తోంది. ఈ నెల 26 నుంచి ప్రభుత్వం పలు నిర్ణయాలను అమలు చేయనుంది. రైతుభరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు కేటాయింపులు ప్రారంభం కానున్నాయి. ఇందు కోసం ఇప్పటికే ప్రభుత్వం కసరత్తు దాదాపు పూర్తి చేసింది. ప్రస్తుతం ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రామ, వార్డు సభలు నిర్వహిస్తున్నారు. కాగా, హైదరాబాద్ లో ఇందిరమ్మ ఇళ్ల కోసం గ్రామ, బస్తీ సభల్లో దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించారు.
ఇందిరమ్మ ఇళ్ల కోసం
తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 26 నుంచి పథకాల అమలు ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది. ఇందు కోసం ఇప్పటికే రైతు భరోసా మార్గదర్శకాలు ఖరారు చేసింది. ఈ నెల 26 నుంచి రైతుల ఖాతాల్లో నిధులు జమ కానున్నాయి. అదే విధంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా సహా 4 కొత్త పథకాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. పార్టీలకు అతీతంగా పేదలైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇందు కోసం గ్రామసభల్లోనూ దరఖాస్తులను స్వీకరించాలని ప్రభుత్వం ఆదేశించింది. లబ్దిదారులు ఎవరూ ఆందోళన అవసరం లేదని మంత్రులు స్పష్టం చేస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు, రేషన్‌కార్డుల ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుందని ప్రకటించారు.
సభల్లోనూ స్వీకరణ
తాజాగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల కోసం 10.72 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. కాగా, ఇప్పటి వరకు 7.80 లక్షల దరఖాస్తుల ప్రక్రియ పూర్తయింది. ఇక, మిగిలిన దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసేందుకు వారం రోజుల సమయం నిర్దేశించారు. సర్వే పూర్తయిన తరువాత వార్డు సభల నిర్వహించాలని నిర్ణయించారు. ఇక, సర్వే సిబ్బంది వివరాలను వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు. https://indirammaindlu.telangana.gov.in/లో చూడొచ్చని గృహనిర్మాణ శాఖ అధికారులు తెలిపారు. గతంలో దరఖాస్తు చేసుకోని వారు వార్డు సభల్లో కొత్తగా దరఖాస్తులు ఇవ్వొచ్చని సూచించారు.
నిరంతరం కొనసాగింపు
ప్రభుత్వం ఇప్పటికే మొదటి దశలో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లను కట్టేం కు నిర్ణయం తీసుకుంది. దాని ప్రకారం జీహెచ్‌ఎంసీలోని 24 నియోజకవర్గాలకు 84,000 ఇళ్లు నిర్మించాల్సి ఉంటుంది. ప్రజాపాలన సభల్లో మొత్తం 10.71లక్షల దరఖాస్తులు అందినట్లు అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. అయితే, గ్రామసభల్లో లబ్దిదారుల నుంచి వస్తున్న అభ్యర్ధనలతో ప్రభుత్వం క్షేత్ర స్థాయి సమాచారం సేకరిస్తోంది. ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తామని ఇప్పటికే హామీ ఇచ్చింది. దీని ద్వారా అర్హుడైన ప్రతీ లబ్దిదారుడికి ఇందిరమ్మ ఇల్లు అందుతుందని భరోసా ఇస్తోంది.









