ఏపీలో గత వైసీపీ పాలనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఐదేళ్ల పాటు వైసీపీ ప్రభుత్వంతో అంటకాగిన అమిత్ షా అప్పట్లో విధ్వంసం జరిగిందంటూ చేసిన వ్యాఖ్యలపై ఏపీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల తీవ్రంగా మండిపడ్డారు. అమిత్ షా వ్యాఖ్యలు ఊసి ఊసరవెల్లి సైతం సిగ్గు పడుతుందన్నారు. ఐదేళ్లలో విధ్వంసం జరుగుతుంటే ఢిల్లీలో కూర్చుని వేడుక చూశారా అని అమిత్ షాను షర్మిల ప్రశ్నించారు.
రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరం పనులను ఆపితే జగన్ ను అడిగారా అని షర్మిల అమిత్ షాను నిలదీశారు. రాజధాని లేని రాష్ట్రంగా 5 ఏళ్లు పాలన చేస్తుంటే కేంద్రానికి కనిపించలేదా అని ప్రశ్నించారు. ఇష్టారాజ్యంగా రూ.10లక్షల కోట్లు అప్పులు చేస్తుంటే విధ్వంసం జరుగుతున్నట్లు అనిపించలేదా అని అడిగారు. సొంత బాబాయి హత్యకేసులో ఢిల్లీ స్థాయిలో న్యాయం కోసం పోరాటం చేస్తుంటే.. కేంద్ర హోం శాఖ మంత్రిగా మౌనంగా ఎందుకున్నారంటూ కడిగేశారు.
భారీ స్థాయిలో అవినీతి జరుగుతుంటే ఒక్కటైనా బయటపెట్టారా అని అమిత్ షాను షర్మిల ప్రశ్నించారు. 5 ఏళ్లపాటు జగన్ మీకు దత్తపుత్రుడని, ఆడించినట్లు ఆడే తోలుబొమ్మ అని షర్మిల తెలిపారు. పార్లమెంట్లో మీ బిల్లులకు మద్దతు పలికే రబ్బర్ స్టాంప్ అన్నారు. రాష్ట్రంలో సహజ వనరులను ‘మోదానీ’కి దోచిపెట్టే ఏజెంట్ అని ఆరోపించారు. మీ ఇష్టారాజ్యంగా 5 ఏళ్లు వైసీపీనీ వాడుకొని, రాష్ట్ర సంపదను దోచుకొని, ఇప్పుడు విధ్వంసం జరిగిందని ముసలి కన్నీరు కార్చితే నమ్మే అమాయకులు రాష్ట్ర ప్రజలు కారన్నారు.
2019-2024 మధ్య జరిగిన విధ్వంసంలో కర్త జగన్ అయితే.. కర్మ, క్రియ బీజేపీ ప్రభుత్వమే అని షర్మిల తెలిపారు. 10 ఏళ్ల పాటు విభజన హామీలు నెరవేర్చకుండా మోసం చేసి, ఇప్పుడు అండగా ఉంటాం. రూ.3లక్షల కోట్లు ఇస్తాం..పూర్వవైభవం తెస్తామనే మీ మాటలు మరో మోసానికి నిదర్శనం అన్నారు. మీ వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటే, మీకు దమ్ముంటే గత 5 ఏళ్ల వైసీపీ పాలనపై వెంటనే కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని అమిత్ షా ను షర్మిల డిమాండ్ చేశారు.









