విద్య, ఆరోగ్యానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గురువారం దుర్గాబాయి దేశ్ముఖ్ రెనోవా క్యాన్సర్ ఆస్పత్రిని సీఎం రేవంత్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మరో 30 రోజుల్లో ప్రజలకు డిజిటల్ హెల్త్ కార్డులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు.
పేదలకు అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందించాల్సి ఉందని సీఎం రేవంత్ అన్నారు. ప్రతి ఒక్కరికీ విడివిడిగా హెల్త్ ప్రొఫైల్ రూపొందించాలని తెలిపారు. రాష్ట్రంలోని 4 కోట్ల ప్రజల హెల్త్ ప్రొఫైల్స్ ను డిజిటల్ చేయాల్సి ఉందని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. ఈ హెల్త్ కార్డుల్లో గత చికిత్స వివరాలు కూడా పొందుపరుస్తారని తెలిపారు.
దుర్గాబాయి దేశ్ ముఖ్ సంఘం ప్రతినిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాల్లో భాగం కావాలని సీఎ రేవంత్ కోరారు. కాగా, ప్రస్తుతం డిజిటల్ కార్డులు అమలులో ఉన్న హర్యానా, రాజస్థాన్, కర్ణాటక రాష్ట్రాల్లో పనితీరుపై అధ్యయనం చేసేందుకు త్వరలో అధికారుల బృందం పర్యటించనుంది.
ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎం రేవంత్ ఫొటో
తెలంగాణ ప్రభుత్వం ఫైనల్ చేసిన సీఎంరేవంత్ రెడ్డి ఫొటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రదర్శించాలని ఆదేశించింది. అక్టోబర్ 7వ తేదీలోపు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ముఖ్యమంత్రి ఫొటో ఏర్పాటు చేయాలని పేర్కొంది. జిల్లా కలెక్టర్లు, డివిజన్, మండల అధికారులకు ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సీఎం రేవంత్ రెడ్డి ఫొటో నమూనాను కూడా విడుదల చేసింది.
ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఫొటో లేదని కొందరు రాజకీయ నాయకులు వాదించడంతో ప్రభుత్వం స్పందించింది. ఈ క్రమంలో అక్టోబర్ 7వతేదీ వరకు ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎం రేవంత్ ఫొటోలు పెట్టేందుకు గడువు ఇస్తూ అన్ని సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అక్టోబర్ 7వ తేదీ వరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఫొటో ఉండాలని స్పష్టం చేసింది. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు గడుస్తున్నా.. ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఫొటో లేకపోవడంతో తాజాగా ఈ మేరకు కాంగ్రెస్ సర్కారు ఆదేశాలు జారీ చేసింది.