ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారం కోల్పోయాక ఆ పార్టీని వీడిన ముగ్గురు కీలక నేతలు బాలినేని శ్రీనివాస రెడ్డి, సామినేని ఉదయ భాను, కిలారి రోశయ్య ఇవాళ జనసేన పార్టీలో చేరారు. వీరితో పాటు మరికొందరు స్థానిక నేతలు కూడా పార్టీ కండువాలు కప్పుకున్నారు. ఇప్పటికే వీరు పార్టీలో చేరేందుకు పవన్ కళ్యాణ్ క్లియరెన్స్ ఇవ్వడంతో ఇవాళ భారీగా తరలివచ్చి జనసేనలో చేరిపోయారు. అయితే వీరికి ఇచ్చే పదవులపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది.
గతంలో వైసీపీలో కీలకంగా పని చేసిన నేతలు బాలినేని శ్రీనివాస రెడ్డి, సామినేని ఉదయ భాను, కిలారి రోశయ్య తాజాగా ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. పవన్ ను కలిసి జనసేనలో చేరేందుకు ఆసక్తి చూపారు. దీంతో వారిని ఇవాళ ఆహ్వానించి ఒకేసారి కండువాలు కప్పేశారు. వీరితో పాటు విజయనగరం జిల్లాకు చెందిన వైసీపీ యువజన విభాగం నేత అవనపు విక్రమ్, ఉమ్మడి విజయనగరం జిల్లా డి.సి.ఎం.ఎస్. ఛైర్ పర్సన్ అవనపు భావన కుడా జనసేన పార్టీలో చేరారు. ఒంగోలుకు చెందిన వ్యాపారవేత్త కంది రవిశంకర్, నెల్లూరుకు చెందిన సినీ నిర్మాత చిట్టమూరు ప్రవీణ్ కుమార్ రెడ్డి కూడా పార్టీలో చేరారు.
ఇవాళ పార్టీలో చేరిన నేతలకు పవన్ కీలక సూచన చేశారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, పల్లె పల్లెకు జనసేన పార్టీ సిద్ధాంతాలను తీసుకెళ్లాలని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ సూచించారు. మరోవైపు ఇవాళ పార్టీలో చేరిన నేతలకు ఇచ్చే పదవులపై ఉత్కంఠ నెలకొంది. వీరిలో కొందరికి త్వరలో నామినేటెడ్ పదవులు ఇచ్చి ఆ తర్వాత ఎమ్మెల్సీ అవకాశం ఇస్తారని తెలుస్తోంది. గతంలో మంత్రిగా పనిచేసిన బాలినేని వంటి వారికి ఇందులో ముందుగా ప్రాధాన్యం లభించవచ్చని చెప్తున్నారు. అయితే వీరి నియోజకవర్గాల్లో కూటమి నేతల వ్యతిరేకత కూడా ఇందులో కీలకంగా మారబోతోంది.