Search
Close this search box.

  రేవంత్ వ్యాఖ్యలతో సబిత కంటతడి..!

తనను ఉద్దేశించి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రా రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డికి మహిళలంటే గౌరవం లేదని ధ్వజమెత్తారు. ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం పొందిన తర్వాత తెలంగాణ అసెంబ్లీ గురువారానికి వాయిదా పడింది. ఈ సందర్భంగా సభలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో సబితా ఇంద్రారెడ్డి తీవ్ర మనస్తాపానికి గురై కంటతడి పెట్టుకున్నారు.

 

అక్కలను నమ్ముకుంటే బతుకు జూబ్లీ బస్టాండ్ అవుతుందంటూ మహిళలను అవమానించే విధంగా సీఎం రేవంత్ మాట్లాడరని సబిత మండిపడ్డారు. సభలో ఏం జరిగిందో ప్రజలందరూ చూశారు. సీఎం అలా ఎందుకు మాట్లాడారో మాకు అర్థం కాలేదు. బడ్జెట్‌పై కేటీఆర్ ప్రతి అంశాన్ని కూలంకషంగా వివరించే ప్రయత్నం చేశారు. కేటీఆర్ ప్రసంగం నుంచి దృష్టి మళ్లించేందుకే సీఎం రేవంత్ ఆ వ్యాఖ్యలు చేశారన్నారు సబితా ఇంద్రారెడ్డి.

 

‘నా గురించి, సునీత గురించి మాట్లాడుతూ పార్టీకి ఏదో మోసం చేశారని రేవంత్ చెప్పారు. మేం ఉన్న పార్టీలో నిబద్ధతతో పనిచేశాం. పార్టీ మారారంటున్న వాళ్లు ఏ పార్టీ నుంచి వచ్చారో ఆలోచించుకోవాలి. అక్కలను నమ్ముకుంటే బతుకు జూబ్లీ బస్టాండ్ అవుతుందంటున్నారు. ఆడబిడ్డలు ఎప్పుడైనా క్షేమం కోరతారు. నమ్ముకున్న వాళ్లకు ప్రాణమైనా ఇస్తాం కానీ.. మోసం చేయం. సబిత, సునీతకు జరిగిన అవమానం కాదిది.. యావత్ తెలంగాణలోని మహిళకు జరిగిన అవమానంగా భావిస్తున్నాం అని సబితా ఇంద్రారెడ్డి వ్యాఖ్యానించారు.

 

గత 24 ఏళ్ల నుంచి ఆ అసెంబ్లీకి వస్తున్నా. ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశా. ఎవరూ ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఈరోజు ముఖ్యమంత్రి పదవికి ఉన్న గౌరవాన్ని తగ్గించే విధంగా రేవంత్ రెడ్డి వ్యవహరించారు. సీఎంకు మహిళలంటే గౌరవం లేదు. గౌరవం ఉంటే వెంటనే రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలి అని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు. మరోవైపు, బీఆర్ఎస్ నేతలు కూడా సీఎం రేవంత్, కాంగ్రెస్ నేతలపై మండిపడుతున్నారు.

 

ఏడుపు ఎందుకమ్మా? అంటూ కాంగ్రెస్ కౌంటర్

 

సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో కంటతడి పెట్టుకున్న సబితా ఇంద్రారెడ్డిపై కాంగ్రెస్ పార్టీ మరోసారి వ్యంగ్యాస్త్రాలు సంధించింది. ‘ ఏడుపు ఎందుకు సబితమ్మా..? చేవెళ్ల చెల్లమ్మా అని కాంగ్రెస్ పార్టీ ఆదరించినందుకా..? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వంలో హోం మంత్రిని చేసినందుకా..? కష్టకాలంలో కాంగ్రెస్ ను మోసం చేసి పదవి కోసం బీఆర్ఎస్ లో చేరినందుకా..? బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూ, లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి పనిచేసినందుకా..? నువ్వు ఏడిస్తే సానుభూతి రాదు సబితమ్మా…’ అంటూ కాంగ్రెస్ పార్టీ సబితకు ప్రశ్నలు సంధించింది.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు