పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నవంబర్ 25 నుంచి ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 20 వరకు కొనసాగనున్నాయి. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు మంగళవారం వెల్లడించారు. ఈ సెషన్లో భాగంగా నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. సంవిధాన్ సదన్ (పాత పార్లమెంట్ భవనం) సెంట్రల్ హాల్ ఇందుకు వేదిక కానుంది.
కాగా, ప్రస్తుతం మహారాష్ట్ర జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలపై అన్ని రాజకీయ పార్టీలు దృష్టి సారించాయి. నవంబర్ 23న ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఆ తర్వాత పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లోనే కేంద్రం వక్ఫ్ సవరణ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
గత పార్లమెంట్ సమావేశాల్లోనే ఈ బిల్లును తీసుకువచ్చింది. అయితే, విపక్షాలు దీనిై తీవ్ర నిరసన వ్యక్తం చేయడంతో కేంద్రం ఒక్క అడుగు వెనక్కివేసి.. దాన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు పంపింది. ఈ నేపథ్యంలో వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లును సభ ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉంది. మరోవైపు, వన్ నేషన్ వన్ ఎలక్షన్ పైనా పార్లమెంటులో చర్చ జరిగే అవకాశం ఉంది.
ఈ రెండు కీలక బిల్లులు సమావేశం ముందుకు రానున్న క్రమంలో చర్చలు వాడీవేడిగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వక్ఫ్ సవరణ బిల్లులతోపాటు జమిలి ఎన్నికలను కూడా ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. దీంతో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం జరిగే అవకాశం ఉంది. సమావేశాలు హాట్ హాట్‌గా సాగనున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు, ఈ సమావేశాల్లో భారతదేశం, కెనడా మధ్య కొనసాగుతున్న దౌత్యపరమైన వివాదం చర్చకు వచ్చే ప్రధాన అంశాలలో ఒకటి. హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య విచారణలో హైకమిషనర్‌తో సహా భారత దౌత్యవేత్తలు “ఆసక్తి ఉన్న వ్యక్తులు” అని కెనడా ప్రభుత్వం అక్టోబర్ 14న చెప్పడంతో ద్వైపాక్షిక సంబంధాలలో ఉద్రిక్తత నాటకీయంగా పెరిగింది.
ఈ దౌత్యవేత్తలను ఉపసంహరించుకోవడం ద్వారా న్యూఢిల్లీ ప్రతిస్పందించింది. అంతేగాక, ఆరుగురు కెనడా దౌత్యవేత్తలను దేశం నుంచి బహిష్కరించింది. ఇంకా, కెనడాలో ఉన్న ఖలిస్తాన్ వేర్పాటువాదులను లక్ష్యంగా చేసుకునే ప్రచారం వెనుక కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఉన్నారని ట్రూడో పరిపాలనలోని సీనియర్ సభ్యులు ఆరోపించారు . ఈ ప్రకటనల తరువాత, భారతదేశం దౌత్య మార్గాల ద్వారా “అత్యంత బలమైన” నిరసనను నమోదు చేసింది. ఆరోపణలను “అసంబద్ధం, నిరాధారమైనది” అని భారత్ పేర్కొంది









