డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ మొదటి లక్ష్యం పిఠాపురం అభివృద్ధి. ఎందుకంటే ఆయన స్వయంగా ప్రకటించిన పట్టణాల్లో పిఠాపురం మొదటి స్థానంలో ఉండాలన్నది లక్ష్యం. ప్రపంచమే గుర్తిస్తుందా అనుకుంటే అది కాలమే సమాధానం చెబుతుంది అంటున్నారు కొందరు. ఎందుకలా అంటన్నారని ఆరా తీస్తే పిఠాపురం మున్సిపాల్టీలో లోపాలే శాపాలుగా మారుతున్నాయి.
పిఠాపురం ఎమ్మెల్యేగా ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురాన్ని ప్రపంచమే గుర్తించే పట్టణంగా తయారు చేస్తానని ఇటీవల హామీ ఇచ్చారు. వాస్తవానికి పవన్ తన పర్యటనలో పిఠాపురాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతానని చెప్పుకొచ్చారు. ఆయన ప్రకటన చేసిన తర్వాత నుండి పిఠాపురంలో వేగంగా పరిణామాలు మారిపోతున్నాయి.
అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ఈనేపథ్యంలో తాజాగా బుధవారం సాలిడ్ అండ్ లిక్విడ్ రిసెర్చ్ మేనేజ్మెంట్ ప్రాజెక్టు డైరక్టర్గా ఉన్న శ్రీనివాసన్ అనే అధికారి పిఠాపురంలో పర్యటించారు. కొన్ని ప్రాంతాలను పరిశీలించిన ఆయన ఇక్కడ పారిశుద్ధ్య పనులపై అసంతృప్తి వ్యక్తంచేశారు. అలాగే సిబ్బంది పనితీరును పరిశీలించారు. లోపాలను గుర్తించారు. నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామన్నారు.
వీరు సరిపోతారా..!
పిఠాపురం పట్టణాన్ని దేశం గర్వించేదగ్గ పట్టణంగా తీర్చిదిద్దుతానని చెబుతున్న పవన్ కళ్యాణ్ కు సవాళ్లు ఎదురవుతున్నాయి. పిఠాపురం పట్టణంలో ఉన్న 30 వార్డుల్లో పారిశుద్ధ్యం చక్కబెట్టాలంటే 200 మంది వరకూ పారిశుద్ధ్య కార్మికులు అవసరం. కాని ఇక్కడ కేవలం 79 మంది మాత్రమే ఉన్నారు. ఇందులో రెగ్యులర్ కార్మికులు 28 ఉండగా, ఔట్ సోర్సింగ్ విధానంలో 51 మంది మాత్రమే పనిచేస్తున్నారు. వీరిలో వివిధ కారణాలతో పనికి రాని వారు, కనీసం 5 మందికి తగ్గకుండా ఉంటారు. రోజుకి పట్టణంలో 1.3 టన్నుల వ్యర్థాలు తరలించాల్సి ఉంటుంది. కేవలం 5 ట్రాక్టర్లు ఉన్నాయి. ఇందులో చిన్నవి రెండు. కాంపక్టర్లు రెండు ఉన్నాయి. పట్టణంలో పారిశుద్ధ్యం మెరుగుపడాలంటే ఇవి సరిపోవు. అధికారులు ఎంత ఉరుకులు పరుగులు పెట్టినా సిబ్బంది, మౌలిక సదుపాయాలు మెరుగుపరిస్తే తప్పితే ఫలితం కష్టమేనని అంటున్నారు పట్టణ వాసులు. పారిశుద్ధ్య సిబ్బంది సంఖ్యను పెంచితే ఫలితాలు మెరుగుపడే అవకాశాలు ఉంటాయని అంటున్నారు.