Search
Close this search box.

  ప్రధాని మోదీపై రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రశంసల జల్లు..!

భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు సోమవారం మాస్కో వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఘన స్వాగతం పలికారు. తన అధికారిక నివాసం నోవో-ఒగారియోవోలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ నాయకత్వాన్ని, విజయాలను పుతిన్ ప్రశంసించారు.

‘ప్రియమైన స్నేహితుడు’ అంటూ మోదీని పలకరించారు. మోదీని కలవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. భారత ప్రధానిగా మరోసారి ఎన్నికైన మోదీకి అభినందనలు తెలిపారు. ఏదో యాదృచ్ఛికంగా మూడోసారి ప్రధాని కాలేదని, భారతదేశ పురోగతికి కృషి చేశారంటూ పుతిన్ ప్రశంసించారు. చాలా ఏళ్లుగా చేసిన కృషికి ఫలితంగా తిరిగి ప్రధాని అయ్యారని మెచ్చుకున్నారు. మోదీ అంకిత భావంతో కృషి చేస్తారని, శక్తిమంతమైన ఆయన నాయకత్వంలో భారత్ ప్రయోజనం పొందుతుందని అన్నారు.

‘‘మీకు మీ సొంత ఆలోచనలు ఉన్నాయి. మీరు చాలా చురుకైన వ్యక్తి. భారతదేశం, దేశ ప్రజల ప్రయోజనాల కోసం చక్కటి ఫలితాలను సాధించగలరు’’ అని పుతిన్ వ్యాఖ్యానించారు. భారత్ ప్రయోజనాల కోసం మోదీ చేస్తున్న కృషికి పుతిన్ అభినందనలు తెలిపారు. భారత్ ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా పటిష్ఠంగా ఉందని మెచ్చుకున్నారు. పుతిన్ అధికారిక నివాసంలో ఇరువురి మధ్య అనధికారిక చర్చల సందర్భంగా రష్యా అధ్యక్షుడు ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని మంత్రి అయ్యాక ఆయనకు ఇది రెండో విదేశీ పర్యటన కావడం విశేషం. ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత రష్యాకు వెళ్లడం ఇదే తొలిసారి.

కాగా అధ్యక్షుడు పుతిన్, ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం విస్తృత చర్చలు జరపనున్నారు. ప్రతినిధి స్థాయి చర్చలు కూడా ఉంటాయి. సమావేశాల అనంతరం ఉమ్మడిగా మీడియా సమావేశం నిర్వహించే అవకాశం ఉందని రష్యా మీడియా వర్గాలు పేర్కొన్నాయి.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు