జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోమారు పేట్రేగిపోయారు. కుల్గాం జిల్లాలోని రెండు గ్రామాల్లో రెండు రోజులుగా కొనసాగుతున్న ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఇద్దరు జవాన్లు అమరులయ్యారు. తాజాగా ఆర్మీ కాన్వాయ్‌ను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు జవాన్లు అమరులయ్యారు.
కథువా జిల్లాలోని మాచేడి-కిండ్లీ- మల్హర్ రోడ్డు మార్గంలో కాపుకాసిన ఉగ్రవాదులు పక్కా ప్రణాళిక ప్రకారం దాడికి తెగబడ్డారు. పెట్రోలింగ్ నిర్వహిస్తున్న ఆర్మీ కాన్వాయ్‌పైకి తొలుత గ్రనేడ్ విసిరారు. దీంతో వాహనం ఆగడంతో కాల్పులు ప్రారంభించారు. ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోగా మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.
కాల్పులతో అప్రమత్తమైన బలగాలు ఎదురు కాల్పులు ప్రారంభించడంతో సమీపంలోని అటవీ ప్రాంతంలోకి ఉగ్రవాదులు పరారయ్యారు. సమాచారం అందుకున్న అదనపు బలగాలు అక్కడికి చేరుకుని ఉగ్రవాదుల కోసం కూంబింగ్ జరుపుతున్నాయి.