పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏది చేసినా సంచలనమే అవుతుంది. ఆయన సోషల్ మీడియాలో మోడీని సైతంపక్కకు నెట్టేశారు. అంతలా ఆయన స్పీచ్‌లతోపాటు, చేస్తున్న పనులు వేగం ఉందనే చెప్పాలి. కాకినాడ జిల్లాలోని పిఠాపురంలో ఆయన పోటీ చేసి 70,259 ఓట్ల అధిక్యంతో జనసేనకు జోష్ ఇచ్చారు.
అంతకముందే పవన్ పిఠాపురంలో నెగ్గిన తర్వాత పిఠాపురాన్నే తన స్థిర నివాసం చేసుకుంటానని హామి ఇచ్చారు.అందుకు తగ్గట్టుగా పవన్ చర్యలకు ఉపక్రమించారు.
ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పవన్ పనివేగాన్ని పెంచారు. ఇందుకోసం ఆయన తనను గెలిపించిన ప్రజల కోసం ఏదోకటి చేయాలన్న తపనతో ఉన్నారు. మొదటగా తన స్థిర నివాసం పిఠాపురంలో ఏర్పాటు చేసుకునేందుకు కసరత్తు మొదలుపెట్టారు. ఈ విషయాన్ని ఆయన పిఠాపురంలో జరిగిన వారాహి సభలో బహిరంగంగా ప్రకటించారు. అయితే ఆయన కొనుగోలు చేసిన భూమి ఎక్కడ ఏంటనేదానిపై అంతా ఆసక్తిగా చూస్తున్న నేపథ్యంలో ఆ వివరాలు బయటకొచ్చాయి.
పిఠాపురం-గొల్లప్రోలు టోల్‌ప్లాజా పక్కనే ఉన్న వ్యవసాయభూమిని పవన్ కళ్యాణ్ తనపేరున రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. మొత్తం 3.52 ఎకరాల భూమిని ఆయన కాకినాడ జనసేన నాయకుడు, లీగల్ అడ్వజైర్ గా ఉన్న తోట సుధీర్ రిప్రజెంటీవ్‌గా రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. 1.44 ఎకరాలు ఒక డాక్యుమెంట్‌గాను, 2.08 ఎకరాల భూమిని రెండో డాక్యుమెంట్‌గా రిజిస్ట్రేషన్ జరిగింది. ఇల్లు క్యాంపు కార్యాలయంతోపాటు, హెలిప్యాడ్, అలాగే కార్యకర్తల సమావేశాలకు భారీగా హాలు కూడా ఈ స్థలంలోనే నిర్మించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
వాస్తవానికి పవన్ 18 ఎకరాల వరకూ భూమిని ఇదే పరిసర ప్రాంతంలో కొనుగోలు చేసి భారీ నిర్మాణం చేపట్టే అవకాశాలున్నాయని అంటున్నారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇల్లు నిర్మించుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఇక్కడ భూమి విలువ రూ.కోటికిపైగా ఉందని చెబుతున్నారు. అయితే ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు లోబడి మాత్రమే రిజిస్ట్రేషన్ చేయించారు. పిఠాపురం మండలంలోని భోగాపురం, ఇలింద్రాడ గ్రామాల రెవిన్యూ పరిధిలో ఉన్న భూమిని పవన్ కొనుగోలు చేయడంతో ఆయా గ్రామాల ప్రజలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి కొద్ది రోజుల్లో ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమాలు చేపట్టే అవకాశాలున్నాయి.