మూడు రోజుల పాటు కాకినాడ జిల్లాలోనే మకాం
ఫించన్‌ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనున్న సేనాని
ఉప్పాడ సముద్ర కోత ప్రాంతాన్ని పరిశీలించనున్న పవన్
ఆఖరి రోజు పిఠాపురం పట్టణంలో వారాహి సభ
డిప్యూటీ సీఎం, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ వరుసగా మూడు రోజుల పాటు పిఠాపురం నియోజకవర్గంతోపాటు, కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు. ఒక రోజు మొత్తం కలెక్టరేట్‌లో అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించున్నారు. సోమవారం ఉదయం 11 గంటలకు గొల్లప్రోలులో ఉన్న హెలిప్యాడ్ వద్దకు పవన్ చేరుకుంటారు. అనంతరం గొల్లప్రోలు పట్టణంలో ఉన్న సత్యకృష్ణ ఫంక్షన్ హాలులో పవన్ ఫించన్‌ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు.
ఏర్పాట్లు పరిశీలిస్తున్న కాకినాడ కలెక్టర్ షాన్ మోహన్ సగిలి
అనంతరం జనసేన ముఖ్య నాయకులతో ఆయన సమావేశ మవుతారు.ఈనెల 2వ తేదిన కాకినాడ కలెక్టరేట్ కార్యాలయంలో ఆయన నిర్వహిస్తున్నశాఖల అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. దీనికి సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఆఖరి రోజు ఈనెల 3వ తేదిన ఆయన గొల్లప్రోలులో ముంపు వాటిల్లే ప్రాంతాలతోపాటు, ఉప్పాడ తీర ప్రాంతాన్ని పరిశీలిస్తారు. సముద్రపు కోతకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో మాట్లాడతారు. అనంతరం అక్కడ నుండి పిఠాపురం పట్టణానికి చేరుకుంటారు. పవన్ పర్యటన నేపథ్యంలో జరుగుతున్న ఏర్పాట్లపై ఆదివారం ఉప్పాడ తీర ప్రాంతాన్ని కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి పరిశీలించారు. జిల్లా కలెక్టర్ వెంట డీఆర్డీఏ పీడీ కె.శ్రీరమణి, రోడ్డు భవనాల శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ క్రాంతు, జిల్లా మత్య్స శాఖ అధికారి కరుణాకర్,కాకినాడ ఆర్డీవో ఇట్ల కిషోర్, పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
పిఠాపురంలో వారాహి సభ
ఈనెల 3వ తేదిన సాయంత్రం 4 గంటలకు పిఠాపురం పట్టణంలోని ఉప్పాడ బస్టాండు వద్ద పవన్ వారాహి సభ నిర్వహిస్తారు. ఆయనను ఎమ్మెల్యేగా గెలిపించిన పిఠాపురం ప్రజలనుద్ధేశించి పవన్ మాట్లాడతారు. ఇందుకు సంబంధించి కాకినాడ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. అనంతరం పవన్ నేరుగా గొల్లప్రోలులోని హెలిప్యాడ్ వద్దకు చేరుకుని అక్కడి నుండి హెలికాఫ్టర్‌లో విజయవాడ చేరుకుంటారు. ఒకవేళ సమయం దాటితే రోడ్డు మార్గం ద్వారా విజయవాడ చేరుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.ఉపముఖ్యమంత్రి పవన్ పర్యటన నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. కాకినాడ జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ ఆధ్వర్యంలో ఒక డీఎస్పీ , 8 మంది సిఐలు, 20 మంది ఎస్సైలు, 8 రోప్ పార్టీలతో భద్రతను కట్టుదిట్టం చేశారు.