Search
Close this search box.

  హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారి విస్తరణకు తొలగిన అడ్డంకులు..

హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారి విస్తరణకు అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. హైవేపై టోల్ వసూలు బాధ్యతల నుంచి వైదొలగేందుకు గుత్తేదారు జీఎమ్మార్ సంస్థ సిద్ధమైంది. ఈ మేరకు జీఎమ్మార్, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా మధ్య ఒప్పందం కుదిరింది. జీఎమ్మార్ వైదొలగిన నేపథ్యంలో కొత్త గుత్తేదారు ఎంపికయ్యే వరకూ టోల్ వసూలు బాధ్యతలు ఎన్‌‌హెచ్‌ఏఐ నిర్వహించనుంది.

విజయవాడ-హైదరాబాద్ హైవే పూర్వాపరాలు..

మొదట్లో రెండు వరసలుగా ఉన్న ఈ రోడ్డును బీఓటీ (బిల్డ్, ఆపరేట్, ట్రాన్సఫర్) పద్ధతిలో విస్తరించడానికి 2010లో అప్పటి యూపీఏ ప్రభుత్వం టెండరు పిలిచింది. జీఎమ్మార్ గుత్తేదారు సంస్థ రూ.1740 కోట్లకు టెండర్ వేసి పనులను దక్కించుకుంది. యాదాద్రి-భువనగిరి జిల్లా చౌటుప్పల్, మండలం దండుమల్కాపురం నుంచి ఏపీలోని నందిగామ వరకూ 181.5 కిలోమీటర్ల పొడవున రహదారిని నాలుగు వరసలుగా విస్తరించింది. 2021 డిసెంబర్ లో పనులను పూర్తి చేసి, తెలంగాణ పంతంగి, కొర్లపహాడ్, ఏపీలో చిల్లకల్లు వద్ద టోల్ ప్లాజాలను నిర్వహిస్తోంది. 2025 జూన్‌తో టోల్ వసూళ్ల గడువు ముగియనుంది.

ఇదిలా ఉంటే, హైవే విస్తరణకు భూసేకరణ చేస్తున్నప్పుడే ఆరు వరుసల నిర్మాణానికి సరిపడా భూమిని సేకరించారు. ఇక టెండర్ ఒప్పందం ప్రకారం, 2024 కల్లా హైవేను ఆరు వరుసల్లో విస్తరించాలి. కానీ, తెలుగు రాష్ట్రాల విభజనతో తమకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని జీఎమ్మార్ కోర్టును ఆశ్రయించింది. ‘‘అప్పట్లో రవాణా వాహనాలు.. ముఖ్యంగా ఇసుక లారీలు ఏపీకి భారీగా వెళ్లేవి. తెలంగాణ ఏర్పాటయ్యాక వాటి సంఖ్య గణనీయంగా తగ్గింది. దాంతో, రోజుకు రూ.20 లక్షల చొప్పున నెలకు రూ.6 కోట్ల వరకూ నష్టం వాటిల్లుతోంది’’ అని సంస్థ పేర్కొంది. ఈ కారణంగా విస్తరణ ఆగిపోయింది. ఈ క్రమంలో జీఎమ్మార్, ఎన్‌హెచ్‌ఏఐల మధ్య పలు దఫాలుగా చర్చలు జరిగాయి. అనంతరం, గడువుకన్నా ముందే టోల్ వసూలు బాధ్యతల నుంచి తప్పుకునేందుకు జీఎమ్మార్ అంగీకరించింది. దీంతో, సంస్థకు నష్టపరిహారం చెల్లించేందుకు ఎన్‌‌హెచ్‌ఏఐ కూడా అంగీకరించింది. విడతల వారీగా ఈ మొత్తాన్ని చెల్లించనున్నట్టు సమాచారం.

కొత్త ఏజెన్సీల ఎంపిక..

తమ పర్యవేక్షణలో 3 నెలల పాటు తాత్కాలిక ప్రాతిపదికన టోల్ వసూలుకు రెండు ఏజెన్సీలను ఎన్‌‌హెచ్‌ఏఐ ఎంపిక చేసింది. పంతంగి, కొర్లపహాడ్‌లలో టోల్ వసూలు బాధ్యతను స్కైలాబ్ ఇన్‌ఫ్రా, చిల్లకల్లులో బాధ్యతలను కోరల్ ఇన్‌ఫ్రా దక్కించుకున్నాయి. అయితే, మూడు నెలల తరువాత టోల్ వసూలు బాధ్యతలు మరో సంస్థకు అప్పగించేదీ, లేనిదీ కేంద్రమే నిర్ణయిస్తుంది.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు