సూపర్ స్టార్ మహేష్ బాబు, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కలయికలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘వారణాసి’పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. ఈ సినిమాను కేవలం ఇండియన్ ఆడియెన్స్‌కే పరిమితం చేయకుండా, ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లేందుకు రాజమౌళి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ‘వారణాసి’ సినిమాపై అంతర్జాతీయ స్థాయిలో ఆసక్తి పెంచేందుకు చిత్ర బృందం ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో రాజమౌళి పెట్టుకున్న ప్రధాన లక్ష్యం ఏంటంటే.. తన కెరీర్లోనే అత్యంత భారీ స్థాయిలో ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయడం. ముఖ్యంగా తన గత చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ అంతర్జాతీయంగా సాధించిన గుర్తింపే ఈ ప్రయత్నానికి మరింత ధైర్యాన్ని ఇచ్చిందని ఆయన వెల్లడించినట్లు సమాచారం.
‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఓటీటీలో విడుదలైన తర్వాత విదేశీ ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన చూసి ఆశ్చర్యపోయామని రాజమౌళి తెలిపారు. ఆ తర్వాత ఈ చిత్రాన్ని 40కి పైగా దేశాల్లో విడుదల చేయడం ద్వారా అంతర్జాతీయ ప్రేక్షకులకు మరింత చేరువయ్యామని పేర్కొన్నారు. ఇప్పుడు ‘వారణాసి’ విషయంలో మాత్రం అంతకుమించిన స్థాయిలో గ్లోబల్ రిలీజ్ ప్లాన్ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక మహేష్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో ప్రియాంక చోప్రాతో పాటు పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు. భారీ యాక్షన్, అడ్వెంచర్ అంశాలతో రూపొందుతున్న ఈ చిత్రం భారతీయ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తుందనే అంచనాలు ఉన్నాయి.
మొత్తానికి ‘ఆర్ఆర్ఆర్’తో అంతర్జాతీయ ప్రేక్షకులను ఆకట్టుకున్న రాజమౌళి.. ఇప్పుడు ‘వారణాసి’తో ప్రపంచవ్యాప్తంగా మరింత పెద్ద మార్కెట్‌ను చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. మరి మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ ప్రపంచ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ప్రభావం చూపించబోతోంది? ఈ సినిమా గ్లోబల్ రిలీజ్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు ఎప్పుడు బయటకు వస్తాయో చూడాలి!









