ఇరుముడి’ అనే టైటిల్ వినగానే అయ్యప్పస్వామి భక్తి, ఆధ్యాత్మికత నేపథ్యంలో సాగే సినిమా అనిపించడం సహజం. అందులోనూ రవితేజ అయ్యప్ప భక్తుడిగా కనిపించడంతో, స్వామి మహిమలను ప్రధానంగా చూపించే కథ అనుకుంటారు. అయితే ఈ సినిమాకు అసలు బలం అక్కడే లేదట. అయ్యప్ప మాలతో ముడిపడిన కథలో ప్రేక్షకులకు కనిపించని మరో కోణాన్ని దర్శకుడు చూపించబోతున్నారనే ఆసక్తి నెలకొంది.
సినిమా పోస్టర్లను గమనిస్తే రవితేజతో పాటు ఆయన కూతురి పాత్రలో కనిపించే చిన్నారిని కూడా ప్రత్యేకంగా హైలైట్ చేశారు. కథ ప్రధానంగా తండ్రి, కూతురు చుట్టూనే తిరుగుతుందని తెలుస్తోంది. ఎవరినీ లెక్కచేయని హీరో.. ఎవరి మాటా వినని వ్యక్తి.. కానీ తన కూతురు మాట మాత్రం తప్పడు. అలాంటి వ్యక్తి జీవితాన్ని తన కూతురు ఎలా మార్చింది? అతను అయ్యప్పమాల ఎందుకు ధరించాడు? మాల వేసుకున్న తర్వాత అతని జీవితంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకున్నాయి? అనే అంశాల చుట్టూ కథ సాగుతుందని సమాచారం.
2022లో వచ్చిన ‘ధమాకా’ తర్వాత రవితేజకు వరుసగా సినిమాలు వచ్చినప్పటికీ, వాటిలో చాలా సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయాయి. ఈ నేపథ్యంలో ‘ఇరుముడి’పై ఆయన అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
ప్రియా భవాని శంకర్, బేబీ నక్షత్ర, సాయికుమార్ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. రవితేజ నుంచి ప్రేక్షకులు ఆశించే యాక్షన్, ఎమోషన్‌తో పాటు తండ్రి–కూతురు అనుబంధాన్ని కూడా ఈ సినిమాలో బలంగా చూపించినట్లు తెలుస్తోంది. మరి అయ్యప్ప మాల వెనుక దాగి ఉన్న అసలు కథ ఏమిటి? ‘ఇరుముడి’ రవితేజకు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.









