మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వరుస భారీ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘డ్రాగన్’ చిత్రంలో నటిస్తున్న ఎన్టీఆర్, ఆ తర్వాత దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ‘గాడ్ ఆఫ్ వార్’ అనే ప్రతిష్టాత్మక చిత్రాన్ని చేయనున్నట్లు ఇప్పటికే ప్రచారం సాగుతోంది.
ఇదిలా ఉండగా, గత కొంతకాలంగా దర్శకుడు నెల్సన్ తో ఎన్టీఆర్ సినిమా చేయబోతున్నారనే వార్తలు సినీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఈ కాంబినేషన్‌పై ఇప్పటి వరకు అధికారిక స్పష్టత లేకపోయినా, తాజాగా నిర్మాత నాగవంశీ చేసిన వ్యాఖ్యలు ఈ వార్తలకు మరింత బలం చేకూర్చాయి.
తాజా ఇంటర్వ్యూలో నాగవంశీ మాట్లాడుతూ, నెల్సన్ దిలీప్ కుమార్‌తో సినిమా చేయాలనే ప్రణాళిక ఉందని వెల్లడించారు. అంతేకాకుండా, ఇప్పటికే నెల్సన్‌కు అడ్వాన్స్ కూడా ఇచ్చామని, అది ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కనున్న ప్రాజెక్ట్ కోసమేనని స్పష్టం చేశారు.
అయితే, ఈ సినిమా ప్రారంభం కావడానికి ఇంకా కొంత సమయం పడుతుందని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఎన్టీఆర్, నెల్సన్ ఇద్దరూ తమ తమ కమిట్మెంట్లతో బిజీగా ఉండటంతో, ఈ క్రేజీ కాంబినేషన్ కొంత ఆలస్యంగా పట్టాలెక్కే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
మొత్తానికి, ఎన్టీఆర్–నెల్సన్ కాంబినేషన్‌పై వస్తున్న వార్తలకు నిర్మాత నాగవంశీ వ్యాఖ్యలతో బలమైన ధృవీకరణ లభించినట్లైంది. దీంతో ఈ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో మరింత ఆసక్తి నెలకొంది.









