టాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల వివాహ వేడుకలు మంగళవారం నుంచి అధికారికంగా ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 26న రాజస్థాన్, ఉదయపూర్‌లోని అత్యంత విలాసవంతమైన ‘మెమెంటోస్ బై ఐటీసీ హోటల్స్ ఏకాయా’ రిసార్ట్ వేదికగా వీరిద్దరూ ఒక్కటి కాబోతున్నారు. కేవలం 100 మంది అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వేడుక అత్యంత ప్రైవేటుగా జరగనుంది. ఇప్పటికే ఇరు కుటుంబాలు ఉదయపూర్ చేరుకుని పెళ్లి పనుల్లో నిమగ్నమయ్యాయి.
ఈ సందర్భంగా ‘విరోష్’ (ViRosh) జంట సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. విజయ్ తన స్విమ్మింగ్ పూల్ ఫోటోను పంచుకోగా, రష్మిక తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పెళ్లి విందు కోసం సిద్ధం చేసిన గ్రీన్ థీమ్ డైనింగ్ టేబుల్ ఫోటోను షేర్ చేశారు. ఆ టేబుల్‌పై ‘విరోష్’ అని రాసి ఉన్న డెకరేషన్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. అతిథుల కోసం ప్రపంచ స్థాయి రుచులతో పాటు రాజస్థానీ సంప్రదాయ వంటకాలను వడ్డించనున్నారు.
పెళ్లి వేడుకల షెడ్యూల్ ప్రకారం, మంగళవారం నుంచి సంగీత్, మెహందీ కార్యక్రమాలు మొదలయ్యాయి. బుధవారం (ఫిబ్రవరి 25) హల్దీ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. చాలా కాలంగా తమ ప్రేమ వ్యవహారాన్ని రహస్యంగా ఉంచిన ఈ జంట, చివరకు పెళ్లి పీటలు ఎక్కుతుండటంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో వీరి వివాహానికి సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.








