ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026లో సెమీస్ దిశగా అడుగులు వేస్తున్న 8 జట్లకు ఐసీసీ అదిరిపోయే వార్తను అందించింది. ఈ టోర్నమెంట్లో సూపర్-8 దశకు చేరిన జట్లు, ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్‌లు సంయుక్తంగా నిర్వహించనున్న 2028 టీ20 ప్రపంచకప్‌కు నేరుగా అర్హత సాధించాయి. నమీబియాపై విజయంతో పాకిస్థాన్ సూపర్-8 బెర్తును ఖరారు చేసుకోవడంతో, ఈ 8 జట్ల జాబితా పూర్తిస్థాయిలో ఖరారైంది.
ప్రస్తుత టోర్నీలో భారత్, పాకిస్థాన్, శ్రీలంక, జింబాబ్వే, వెస్టిండీస్, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా మరియు న్యూజిలాండ్ జట్లు సూపర్-8లో తలపడనున్నాయి. ఐసీసీ నిబంధనల ప్రకారం, సూపర్-8కి చేరిన జట్లు ఆటోమేటిక్‌గా తదుపరి ప్రపంచకప్‌కు క్వాలిఫై అవుతాయి. ఆశ్చర్యకరంగా ఈసారి బలమైన ఆస్ట్రేలియా జట్టు గ్రూప్ దశలోనే నిష్క్రమించినప్పటికీ, 2028 టోర్నీకి ఆతిథ్య దేశం హోదాలో వారు నేరుగా అర్హత పొందుతారు.
ఈ 8 జట్లు కాకుండా, మార్చి 9 నాటి ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ ఆధారంగా మరో మూడు జట్లకు (బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్, ఐర్లాండ్) అవకాశం లభించనుంది. మిగిలిన 8 స్థానాలను వివిధ రీజనల్ క్వాలిఫయర్ల ద్వారా భర్తీ చేస్తారు. ఇక 2026 ప్రపంచకప్ అసలు సమరం ఫిబ్రవరి 21 నుంచి ప్రారంభం కానుంది. గ్రూప్-1లో భారత్, సౌతాఫ్రికా, వెస్టిండీస్, జింబాబ్వే ఉండగా.. గ్రూప్-2లో పాకిస్థాన్, ఇంగ్లండ్, శ్రీలంక, న్యూజిలాండ్ జట్లు సెమీస్ పోరు కోసం పోటీపడనున్నాయి.








