ఆదిత్యధర్ దర్శకత్వంలో రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన ‘ధురంధర్’ సినిమాలో ప్రతినాయకుడి (రెహమాన్ డెకాయిట్) పాత్రను నాగార్జున తిరస్కరించినట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. రజనీకాంత్ ‘కూలీ’ సినిమాలో నాగ్ విలన్ పాత్రలో నటిస్తున్న నేపథ్యంలో, డేట్స్ సర్దుబాటు కాక ‘ధురంధర్’ను వదులుకున్నారని అందరూ భావించారు. అయితే, ఈ వార్తలపై నాగార్జున స్పందిస్తూ, తనకు అసలు ‘ధురంధర్’ టీమ్ నుండి ఎలాంటి ఆఫర్ రాలేదని స్పష్టం చేశారు. “అలాంటిదేమీ లేదు. నాకు ఎవరూ ఏ పాత్ర ఆఫర్ చేయలేదు. అయితే ఆ ఆఫర్ వచ్చి ఉంటే బాగుండేదని నా అనిపిస్తోంది” అని ఆయన సరదాగా వ్యాఖ్యానించారు.
సినిమా విజయంపై చిత్ర బృందాన్ని మెచ్చుకున్న నాగార్జున, అక్షయ్ ఖన్నా నటనను ప్రత్యేకంగా అభినందించారు. ‘ధురంధర్’ ఒక అద్భుతమైన చిత్రమని, దర్శకుడు ఆదిత్యధర్ మేకింగ్ స్టైల్ తనకు ఎంతో ఇష్టమని పేర్కొన్నారు. ఈ సినిమా చూశాక, ప్రేక్షకులు ఇప్పుడు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన కథలను ఆశిస్తున్నారని తనకు అర్థమైందని, అందుకే తన 100వ సినిమా (King 100) విషయంలో ఏమాత్రం తొందరపడకుండా, అత్యున్నత ప్రమాణాలతో రూపొందిస్తున్నామని నాగ్ వెల్లడించారు. తాను కూడా ఈ సినిమా సీక్వెల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు ఆయన తెలిపారు.








