మాస్ కా దాస్ విశ్వక్ సేన్, టాలెంటెడ్ డైరెక్టర్ కేవీ అనుదీప్ కాంబినేషన్లో వస్తున్న అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ ‘ఫంకీ’. ఫిబ్రవరి 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఖమ్మంలో వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. గత ఏడాది తన సినిమాల ప్లాపుల వల్ల కొంత నిరాశలో ఉన్నానని, కానీ ‘ఫంకీ’ తన కెరీర్లో మళ్ళీ కొత్త ఉత్సాహాన్ని నింపుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. టైం బాగున్నప్పుడే కాదు, బాగోలేనప్పుడు కూడా అండగా నిలిచిన అభిమానులకు ఆయన ఈ వేదికపై కృతజ్ఞతలు తెలిపారు.
సినిమా విశేషాల గురించి చర్చిస్తూ, తన 30 ఏళ్ల వయసులో ఈసారి విడుదల విషయంలో చాలా రిలాక్స్‌గా ఉన్నానని విశ్వక్ పేర్కొన్నారు. గత రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడకపోయినా, ఓపికగా తన వెంట నిలిచిన ప్రేక్షకులే తన బలం అని ఆయన ఎమోషనల్ అయ్యారు. “పడటం తప్పు కాదు.. తిరిగి మళ్ళీ నిలబడకపోవడమే తప్పు” అంటూ తన కెరీర్ ఎదుగుదలపై ఉన్న క్లారిటీని చాటుకున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ కయాదు లోహర్‌తో కెమిస్ట్రీ మరియు మాస్ సాంగ్స్ థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
వాలెంటైన్స్ డే గురించి మాట్లాడుతూ, తనది పదేళ్ల నుంచి “రెక్కాడితే గానీ డొక్కాడని జీవితం” అని, అందుకే ఇలాంటి పండుగలు జరుపుకునే తీరిక లేదని తనదైన శైలిలో స్పందించారు. అయితే, ఫిబ్రవరి 14వ తేదీన తన సినిమా సక్సెస్‌తో అందరికీ థ్యాంక్స్ చెప్పే రోజుగా మారుతుందని ఆయన ఆకాంక్షించారు. ఖమ్మం సెంటిమెంట్ ‘ఫంకీ’కి కూడా వర్తిస్తుందని, ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ప్రతి ఒక్కరినీ నవ్విస్తుందని ఆయన హామీ ఇచ్చారు.









