గతేడాది విడుదలై రూ.1300 కోట్లకు పైగా వసూళ్లతో ప్రభంజనం సృష్టించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్’ సీక్వెల్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ధురంధర్ 2’ మార్చి 19, 2026న ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదలకు సిద్ధమవుతోంది. ఇటీవల విడుదలైన టీజర్‌లోని “ఇది నూతన భారతదేశం… సరిహద్దులు దాటి చొరబడుతుంది… దెబ్బ కొట్టి తీరుతుంది” అనే పవర్ఫుల్ డైలాగ్స్ సినిమాపై ఉన్న క్రేజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లాయి.
తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా థియేటర్లలోకి రాకముందే తన బడ్జెట్‌ను రికవరీ చేయడమే కాకుండా మేకర్స్ లాభాల్లోకి ప్రవేశించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. సుమారు రూ.250 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం, నాన్-థియేట్రికల్ రైట్స్ ద్వారానే ఆ మొత్తాన్ని రాబట్టడం విశేషం. ప్రముఖ ఆడియో సంస్థ టీ-సిరీస్ మ్యూజిక్ రైట్స్ కోసం రూ.60 కోట్లు వెచ్చించగా, జియో హాట్‌స్టార్ డిజిటల్ రైట్స్‌ను రూ.150 కోట్లకు పైగా ధరకు సొంతం చేసుకున్నట్లు సమాచారం. శాటిలైట్ రైట్స్ కూడా భారీ రేటుకు అమ్ముడుపోవడంతో, రిలీజ్‌కు ముందే సినిమా సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయింది.
రణ్వీర్ సింగ్ గూఢచారిగా నటిస్తున్న ఈ సీక్వెల్లో యాక్షన్ సన్నివేశాలు మునుపెన్నడూ చూడని విధంగా ఉంటాయని చిత్ర యూనిట్ పేర్కొంటోంది. మొదటి భాగం కేవలం హిందీలోనే ఘనవిజయం సాధించగా, ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో ఐదు భాషల్లో విడుదలవుతుండటంతో బాక్సాఫీస్ వద్ద రూ.2000 కోట్ల మార్కును అందుకుంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. టీజర్ సృష్టించిన ఇంపాక్ట్‌తో మార్చి 19 కోసం సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.









