భోగి పండగ సందర్భంగా అల్లు అర్జున్ తన 23వ చిత్రాన్ని (AA23) ప్రకటించి అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. ‘విక్రమ్’, ‘లియో’, ‘కూలీ’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల దర్శకుడు లోకేశ్ కనగరాజ్ ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది. దీనికి సంబంధించి విడుదల చేసిన ఒక ప్రత్యేక యానిమేటెడ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో లోకేశ్ మార్క్ స్టైల్, బన్నీ స్వాగ్ కనిపిస్తుండటంతో అంచనాలు అప్పుడే ఆకాశాన్ని తాకాయి.
ఈ చిత్రానికి యువ సంగీత సంచలనం అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించబోతున్నారు. లోకేశ్-అనిరుధ్ కాంబినేషన్ అంటేనే మ్యూజికల్‌గా ఒక రేంజ్లో ఉంటుందని అందరికీ తెలిసిందే. ఇప్పుడు వీరితో అల్లు అర్జున్ జతకట్టడంతో ఇది ఒక ‘ఎటర్నల్ కొలాబరేషన్’ (శాశ్వతంగా నిలిచిపోయే కలయిక) అని చిత్ర బృందం పేర్కొంది. షూటింగ్ షెడ్యూల్ గురించి ఇంకా స్పష్టత రానప్పటికీ, 2026 లోనే ఈ మూవీ సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది.
ప్రస్తుతం అల్లు అర్జున్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తన 22వ చిత్రంలో (#AA22xA6) నటిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ సినిమాలో దీపికా పదుకొణె, జాన్వీ కపూర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. టైగర్ ష్రాఫ్ కూడా ఒక కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఈ సినిమా పనులు పూర్తయిన తర్వాతే అల్లు అర్జున్ – లోకేశ్ కనగరాజ్ మూవీ ప్రారంభం కానుంది. అట్లీ మూవీ ఒకవైపు, లోకేశ్ సినిమా మరోవైపు ప్రకటించడంతో మెగా అభిమానులు సంక్రాంతి ఆనందంలో మునిగిపోయారు.









