పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు మారుతి కాంబినేషన్‌లో వస్తున్న ‘ది రాజా సాబ్’ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ సినిమా కేవలం ఒక హారర్ కామెడీ మాత్రమే కాదని, ప్రభాస్ లోని వింటేజ్ స్వాగ్‌ను తిరిగి చూపే ఒక విజువల్ వండర్ అని చిత్రబృందం నమ్మకంగా చెబుతోంది. ఈ చిత్రంలో ప్రభాస్‌ను మునుపెన్నడూ చూడని రీతిలో, కొత్త లుక్ మరియు స్టైలిష్ బాడీ లాంగ్వేజ్‌తో మారుతి ప్రజెంట్ చేస్తున్నారు.
దర్శకుడు మారుతి తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ సినిమాలో ఒక ‘క్రేజీ ఎపిసోడ్’ ఉంటుందని, అది భారతీయ సినిమా చరిత్రలోనే ఒక సరికొత్త ప్రయోగమని వెల్లడించారు. ఆ ఎపిసోడ్ థియేటర్లలో ప్రేక్షకులకు మైండ్ బ్లోయింగ్ అనుభూతిని ఇస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కేవలం మాటల్లో వినడం కంటే, ఆ సన్నివేశాన్ని వెండితెరపై చూసినప్పుడే దాని అసలు మజా అర్థమవుతుందని, ప్రభాస్ కెరీర్ లోనే ఇది ఒక గుర్తుండిపోయే పాత్ర అవుతుందని ఆయన తెలిపారు.
ఈ చిత్రం జనవరి 9న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. హారర్ ఫాంటసీ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ప్రభాస్ సరసన మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ మరియు రిద్ది కుమార్ నటిస్తున్నారు. ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా పాటలు ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. మారుతి చెప్పిన ఆ ‘సీక్రెట్ ఎపిసోడ్’ ఏమిటా అని ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.









