బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ దర్శకుడిగా తన ప్రస్థానాన్ని ఘనంగా ప్రారంభించారు. ఢిల్లీలో జరిగిన ‘ఎన్డీటీవీ ఇండియన్ ఆఫ్ ది ఇయర్ – 2025’ వేడుకల్లో ఆర్యన్ ‘బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును అందుకున్నారు. నెట్‌ఫ్లిక్స్ సిరీస్ ‘ది బాడ్స్ ఆఫ్ బాలీవుడ్’ (The Bads of Bollywood) కు దర్శకత్వం వహించినందుకు గాను ఆయనకు ఈ గౌరవం దక్కింది. ఈ సందర్భంగా వేదికపై ఆర్యన్ చేసిన ప్రసంగం అక్కడున్న వారందరినీ ఆకట్టుకోవడమే కాకుండా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
తొలి అవార్డు అందుకున్న ఆనందంలో ఆర్యన్ మాట్లాడుతూ.. తనకు తన తండ్రి లాగే అవార్డులంటే చాలా ఇష్టమని, కానీ ఈ మొదటి అవార్డు మాత్రం తన తండ్రికి కాకుండా తల్లి గౌరీ ఖాన్‌కు అంకితం ఇస్తున్నట్లు ప్రకటించారు. “మా అమ్మ ఎప్పుడూ నన్ను త్వరగా పడుకోమని, ఇతరులను ఎగతాళి చేయవద్దని, అసభ్య పదజాలం వాడొద్దని చెబుతుంటుంది. కానీ ఆశ్చర్యకరంగా నేను అవే పనులు చేసినందుకు (సిరీస్ కథాంశం రీత్యా) నాకు ఈ అవార్డు వచ్చింది. ఈ రోజు అమ్మను సంతోషపెట్టినందుకు ఎన్డీటీవీకి కృతజ్ఞతలు. కనీసం ఈ రోజు ఇంటికి వెళ్లాక అమ్మ నుంచి తిట్లు తక్కువ పడతాయని ఆశిస్తున్నా” అంటూ చమత్కరించారు.
ఈ వేడుకలో ఆర్యన్ అమ్మమ్మ సవితా చిబ్బర్ కూడా పాల్గొన్నారు. మనవడు అవార్డు అందుకోవడం చూసి ఆమె ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. ఆమెను చూసిన ఆర్యన్ వేదిక దిగి వచ్చి ఆమెను ఆలింగనం చేసుకుని, తన తదుపరి అవార్డును కచ్చితంగా ఆమెకే అంకితం చేస్తానని మాటిచ్చారు. ఆర్యన్ దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ బాలీవుడ్‌లోని బంధుప్రీతి (Nepotism) మరియు అంతర్గత రాజకీయాలపై వ్యంగ్యంగా సాగుతుంది. ఇందులో లక్ష్య, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషించారు.









