మాస్ మహారాజా రవితేజ ప్రధాన పాత్రలో, కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. ఇటీవల కాలంలో వరుసగా మాస్ యాక్షన్ సినిమాలతో సందడి చేసిన రవితేజ, ఈసారి పూర్తిస్థాయి వినోదాత్మకమైన ‘క్లాస్’ చిత్రంతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యారు. తాజాగా విడుదలైన ఈ చిత్ర టీజర్ సినిమాపై అంచనాలను పెంచుతోంది.
ఈ సినిమాలో రవితేజ సరసన డింపుల్ హయాతి, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇద్దరు భామల మధ్య నలిగిపోయే సగటు భర్తగా రవితేజ తనదైన శైలిలో కామెడీ పండించనున్నట్లు టీజర్ ద్వారా స్పష్టమవుతోంది. ముఖ్యంగా “వదిన వాళ్ళ చెల్లి అంటే వైఫేగా” అంటూ ఆయన చెప్పే డైలాగులు, గతంలో వచ్చిన ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’ వంటి సినిమాలను గుర్తుచేస్తూ వినోదాన్ని పంచుతున్నాయి.
సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సంక్రాంతి బరిలో ‘ది రాజాసాబ్’, ‘మన శంకర వరప్రసాద్ గారు’, ‘అనగనగా ఒక రాజు’ వంటి భారీ చిత్రాలతో పాటు రవితేజ ‘BMW’ కూడా థియేటర్లలో సందడి చేయనుంది.









