తెలుగులో అత్యంత ఆదరణ పొందిన రియాలిటీ షో బిగ్‌బాస్‌పై ప్రముఖ సినీ నటి కరాటే కల్యాణి సంచలన ఆరోపణలు చేశారు. తాజాగా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, ఆ షోలో పాల్గొనడం వల్ల తనకు లాభం కంటే నష్టమే ఎక్కువ జరిగిందని, తన సినీ కెరీర్‌కు తీవ్ర ఆటంకం కలిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. బిగ్‌బాస్ వల్ల తాను ఇండస్ట్రీకి కూడా దూరం కావాల్సి వచ్చిందని ఆమె బాంబు పేల్చారు.
కరాటే కల్యాణి తన నష్టాన్ని వివరిస్తూ, “నేను బిగ్‌బాస్‌లోకి వెళ్లడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ జరిగింది. అక్కడ సంపాదించిన దానికన్నా రెండింతలు నష్టపోయాను” అని పేర్కొన్నారు. ఆ షో అగ్రిమెంట్ కారణంగా తనకు సినిమా అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయని, షోకు వెళ్తే అవకాశాలు కల్పిస్తామని చెప్పినా, బయటకు వచ్చాక తనను ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అవకాశాలు లేకపోవడం తనను చాలా బాధించిందని ఆమె తెలిపారు.
తెలుగులో ఎంతోమందికి పాప్యులారిటీ మరియు సినిమా అవకాశాలు తెచ్చిపెట్టిన బిగ్‌బాస్ షోపై నటి ఇలాంటి తీవ్ర ఆరోపణలు చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా, కొందరు నెటిజన్లు షో వల్ల నష్టం జరుగుతున్నప్పుడు ఎందుకు అంత ఆసక్తితో వెళ్తున్నారని విమర్శిస్తున్నారు. మరికొందరు మాత్రం ఆమె చెప్పిన దాంట్లో నిజం ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు.








