టాలీవుడ్ స్టార్ నటుడు ప్రభాస్, తన తాజా చిత్రం ‘బాహుబలి: ది ఎపిక్’ ప్రచారం కోసం ప్రస్తుతం జపాన్‌లో పర్యటిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 12న జపాన్‌లో విడుదల కానుంది. ఈ పర్యటన వేళ జపాన్‌లో పెను భూకంపం సంభవించిందనే వార్తలు రావడంతో, ప్రభాస్ అభిమానుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.
ప్రభాస్ ఎలా ఉన్నారోనని ఆందోళన చెందిన అభిమానులు, సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ దర్శకుడు మారుతిని ట్యాగ్ చేసి తమ హీరో క్షేమం గురించి ప్రశ్నించారు. ఒక అభిమాని “జపాన్‌లో భూకంపం వచ్చింది. సునామీ హెచ్చరికలు జారీ చేశారు. మా హీరో ఎక్కడ, ఎలా ఉన్నాడు?” అని అడగగా, దీనిపై మారుతి వెంటనే స్పందించారు.
దర్శకుడు మారుతి స్పందిస్తూ, “ప్రభాస్‌తో ఇప్పుడే మాట్లాడాను. ఆయన క్షేమంగా ఉన్నారు. ఆందోళన చెందకండి” అని క్లారిటీ ఇచ్చారు. దీంతో తమ అభిమాన హీరో క్షేమంగా ఉన్నారనే విషయం తెలుసుకుని ప్రభాస్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.








