భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మాజీ ఎమ్మెల్యే, ప్రజల మనిషిగా పేరుగాంచిన గుమ్మడి నర్సయ్య గారి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ప్రారంభోత్సవం శనివారం పాల్వంచలో జరిగింది. ఈ బయోపిక్‌లో కన్నడ అగ్ర హీరో శివరాజ్ కుమార్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. కొత్త దర్శకుడు పరమేశ్వర్ హివ్రాలే దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర నిర్మాణ కార్యక్రమాన్ని సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, ముహూర్తపు షాట్‌కు కెమెరా స్విచ్ ఆన్ చేసి లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, గుమ్మడి నర్సయ్య నిబద్ధత, నిజాయితీ, సేవా భావాన్ని కొనియాడారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ తన జీతం, ఆస్తులను దానం చేయడం, అలాగే సాధారణ సైకిల్‌పై తిరగడం నర్సయ్య నిరాడంబరతకు నిదర్శనమని పేర్కొన్నారు. పేదవారికి అంకితమైన ఆయన జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. పాల్వంచలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభోత్సవంలో పాల్గొనడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
గుమ్మడి నర్సయ్య పాత్ర పోషిస్తున్న శివరాజ్ కుమార్ ఈ సందర్భంగా మాట్లాడారు. మంచి మనిషి జీవిత చరిత్రలో నటించడం తనకు గర్వకారణంగా ఉందన్నారు. తన తండ్రి (రాజ్‌కుమార్) ఎప్పుడూ ఇతరుల కోసం బతకాలని చెప్పేవారని, నర్సయ్యను చూసినప్పుడు ఆయనలో తన తండ్రిని చూసినట్లు అనిపించిందని తెలిపారు. ఈ సినిమా కోసం త్వరలోనే తెలుగు నేర్చుకుంటానని, స్వయంగా డబ్బింగ్ చెప్పుకుంటానని శివరాజ్ కుమార్ ప్రకటించారు. రాజకీయాల్లోకి రావాలనుకునే యువత ఈ సినిమాను తప్పక చూడాలని ఆయన పిలుపునిచ్చారు.








