పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ‘సీతారామం’ ఫేం హను రాఘవపూడి కాంబినేషన్‌లో రాబోతున్న పీరియాడికల్ డ్రామా ‘ఫౌజీ’ పై మరో ఆసక్తికరమైన అప్డేట్ వచ్చింది. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా రూపొందించనున్నట్లు దర్శకుడు హను రాఘవపూడి తెలిపారు. అయితే, ఇది సీక్వెల్ కాకుండా, ప్రీక్వెల్ ప్లాన్ చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. భారతదేశ వలస రాజ్యాల చరిత్రను అన్వేషిస్తూ, కొన్ని విషాదకరంగా ముగిసినా మరో కథలో అద్భుతమైన కథలుగా ఉండే అనేక అంశాలను ఈ చిత్రం ద్వారా చూపించనున్నట్లు డైరెక్టర్ హింట్ ఇచ్చారు.
‘ఫౌజీ’ మూవీని ప్రీక్వెల్‌గా ప్లాన్ చేయడానికి ప్రధాన కారణం.. ఈ ప్రపంచంలో మరిన్ని విభిన్న కోణాలను అన్వేషించాలనే ఆలోచనే. ఫస్ట్ పార్ట్‌లో ప్రభాస్ పాత్ర ఒక కోణంలో సాగితే, ప్రీక్వెల్‌లో ఆయన రోల్ పూర్తిగా భిన్నంగా ఉంటుందని హను తెలిపారు. పర్సనల్‌గా తనకు స్ఫూర్తినిచ్చిన కొన్ని రియల్ లైఫ్ సంఘటనలను ఇందులో చూపించనున్నట్లు, స్వాతంత్ర్య యోధుల కథలను విషాదంగా కాకుండా ఆకాంక్షాత్మక చిత్రాలుగా రూపొందించడం ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. ‘ఫౌజీతో ఓ సరికొత్త ప్రపంచాన్నే సృష్టించబోతున్నాం’ అని ఆయన తెలిపారు.
‘ఫౌజీ’ మూవీ స్వాతంత్ర్యం ముందు, అంటే 1930ల కాలంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కనుంది. ఈ చిత్రంలో ప్రభాస్ ఒక బెటాలియన్ నాయకుడిగా, శక్తివంతమైన సైనికుడిగా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్‌లో, “పద్మవ్యూహ విజేత పార్థ, పాండవపక్షే సంస్థ కర్ణ, గుర్విరహిత ఏకలవ్య, జన్మనేవ చ యోధా ఏషః” అనే సంస్కృత శ్లోకం ద్వారా ధర్మం వైపు నిలబడ్డ చరిత్రలో ఒక యోధుడి కథను చూపించనున్నట్లు దర్శకుడు హింట్ ఇచ్చారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఆగస్ట్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.









