బాలీవుడ్ నటి దీపికా పదుకోన్ రోజుకు 8 గంటల పని అనే తన నిర్ణయాన్ని మరోసారి బలంగా సమర్థించుకున్నారు. ఈ డిమాండ్, ఇతర కండిషన్ల కారణంగా ఆమెను భారీ ప్రాజెక్టుల నుంచి తప్పించారనే వార్తలు ఇటీవల సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన నేపథ్యంలో, దీపికా ఈ అంశంపై స్పష్టత ఇచ్చారు. 8 గంటల పని అనేది సరైనదేనని, నిబద్ధత కోసం సినీ పరిశ్రమలో అధిక పనిని భరిస్తున్నామని, ఈ రెండింటి మధ్య గందరగోళానికి గురవుతున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఒక తల్లిగా మారిన తర్వాత తన తల్లిపై మరింత గౌరవం పెరిగిందని, పిల్లల బాధ్యతతో పాటు పనిని సమన్వయం చేసుకోవడం వాస్తవంలో చాలా కష్టమని ఆమె వివరించారు. కొత్తగా తల్లయిన వారికి అందరూ మద్దతుగా నిలబడాలని ఆమె కోరారు.
అధికంగా పని చేయడం అనేది సర్వసాధారణమైపోయిందని, కానీ రోజుకు 8 గంటల పని మాత్రమే శరీరానికి, మనసుకు సరిపోతుందని దీపికా అభిప్రాయపడ్డారు. మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే అత్యుత్తమంగా పని చేయగలమని, టెన్షన్, ఒత్తిడితో ఉన్నప్పుడు మంచి అవుట్‌పుట్ ఇవ్వలేమని ఆమె స్పష్టం చేశారు. తన సొంత కార్యాలయంలో కూడా సోమవారం నుంచి శుక్రవారం వరకు 8 గంటలు మాత్రమే పని చేస్తామని దీపికా వెల్లడించారు. ఇటీవల, ప్రభాస్ ‘స్పిరిట్’, ‘కల్కి 2898AD’ సీక్వెల్ వంటి భారీ ప్రాజెక్టుల నుంచి 8 గంటల పని డిమాండ్ కారణంగానే ఆమెను తప్పించారనే ప్రచారం జరిగింది. దీనిపై కొందరు ఆమెకు మద్దతు ఇవ్వగా, మరికొందరు ట్రోల్ చేశారు.
ఈ విషయంపై ఆమె గతంలో స్పందిస్తూ, తనకు ఆరోగ్యం అన్నింటికంటే ముఖ్యమని పేర్కొన్నారు. వృత్తిపరంగా, వ్యక్తిగతంగా తీరిక లేకుండా గడుపుతున్నప్పటికీ, ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాల్సిన అవసరాన్ని తాను అర్థం చేసుకున్నానని తెలిపారు. నిద్ర, వ్యాయామం, పోషకాహారం వంటి వాటికి జీవితంలో ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని, ఐస్ బాత్‌లు లేదా రెడ్ లైట్ థెరపీల కంటే తన ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే తనకు ముఖ్యమని దీపికా పదుకోన్ స్పష్టం చేశారు.









