బాలీవుడ్ సీనియర్ నటుడు, యాక్షన్ కింగ్‌గా పేరుగాంచిన ధర్మేంద్ర (89) ఆరోగ్యంపై సోషల్ మీడియాలో వచ్చిన తప్పుడు వార్తలను ఆయన కుమార్తె, నటి ఈషా డియోల్ తీవ్రంగా ఖండించారు. గత వారం రోజులుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ధర్మేంద్రను ముంబైలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. ఆయనకు శ్వాస సమస్యలు తలెత్తడంతో వైద్యులు వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారని వార్త కథనం పేర్కొంది. ఈ సమయంలో, ధర్మేంద్ర ‘మృతి చెందారు’ అనే వార్తలు వేగంగా వ్యాప్తి చెందడంతో అభిమానుల్లో ఆందోళన మొదలైంది.
ఈ నేపథ్యంలో ఈ తప్పుడు వార్తలపై మంగళవారం స్పందించిన ఈషా డియోల్, తన తండ్రి ఆరోగ్యం నిలకడగా ఉందని స్పష్టం చేశారు. “మీడియా అనవసరమైన ఆత్రుతతో తప్పుడు వార్తలను ప్రచారం చేస్తోంది. నాన్న ఆరోగ్యం నిలకడగా ఉంది, ఆయన కోలుకుంటున్నారు. దయచేసి మా కుటుంబానికి కొంత ప్రైవసీ ఇవ్వాలని కోరుతున్నాం. నాన్న త్వరగా కోలుకోవాలని ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు” అని ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ప్రకటన విడుదల చేశారు.
ఈషా డియోల్ ఈ ప్రకటనతో పాటు, తన పోస్ట్‌కు కామెంట్స్ సెక్షన్‌ను కూడా నిలిపివేశారు (డిసేబుల్ చేశారు). ధర్మేంద్ర ఆరోగ్య పరిస్థితిపై వస్తున్న ఊహాగానాలకు ఈషా డియోల్ ప్రకటనతో తెరపడింది. ధర్మేంద్ర త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులు ప్రార్థిస్తున్నారు.









