Search
Close this search box.

  నా భర్తకు యాక్సిడెంట్ అవుతుందని ముందే కల వచ్చింది: సుమ కనకాల షాకింగ్ వ్యాఖ్యలు

ప్రముఖ యాంకర్, నటి సుమ కనకాల తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఓ ఆసక్తికరమైన, సంచలన విషయాన్ని తాజాగా వెల్లడించారు. తన భర్త, నటుడు రాజీవ్ కనకాలకు ప్రమాదం జరుగుతుందని తనకు ముందే కలలో కనిపించిందని, ఆ కల నిజమైందని ఆమె వివరించారు. ఈ విషయాన్ని ఆమె ఒక పాడ్‌కాస్ట్‌లో పంచుకున్నారు. ఆనాటి ఘటనను గుర్తు చేసుకుంటూ, “నాకు కొన్నిసార్లు వచ్చే కలలు నిజమవుతుంటాయి. ఒకసారి రాజీవ్‌కు షూటింగ్‌లో యాక్సిడెంట్ అయి కాలు విరిగినట్లు కల వచ్చింది” అని తెలిపారు.

ఆ రోజుల్లో మొబైల్ ఫోన్లు లేవని, ఆయన షూటింగ్‌లో ఉన్నప్పుడు ఒక రోజంతా ఫోన్ రాకపోవడంతో తాను కంగారుపడ్డానని సుమ చెప్పారు. తర్వాత ఫోన్ చేసి అడగగా, రాజీవ్ నిజంగానే కారు చెట్టుకు ఢీకొని తనకు కాలు విరిగిందని చెప్పారని ఆమె వివరించారు. వెంటనే తాను అక్కడికి వెళ్లి ఆయన్ను ఆసుపత్రికి తీసుకెళ్లానని సుమ ఆనాటి షాకింగ్ సంఘటనను గుర్తు చేసుకున్నారు. ఇలాంటి కలలు ఒక్కోసారి భయపెడతాయని ఆమె అన్నారు. ఇది కాకుండా, తన భర్త రాజీవ్, కెరీర్ ఆరంభంలో యాక్టింగ్ కాకుండా వ్యాపార రంగంలోకి వెళ్లమని తనకు సలహా ఇచ్చారని కూడా సుమ ఈ సందర్భంగా తెలిపారు.

ఇదే ఇంటర్వ్యూలో, తమ విడాకులపై ఎప్పటి నుంచో వస్తున్న వదంతులపై కూడా సుమ తీవ్రంగా స్పందించారు. “మా పెళ్లై 25 ఏళ్లు దాటింది. ఏ బంధంలోనైనా ఒడుదొడుకులు ఉంటాయి. మా జీవితం కూడా ఓ రోలర్‌కోస్టర్ లాంటిదే” అని ఆమె అన్నారు. కొందరు తమ విడాకుల గురించి రాశారని, తాము కలిసి వీడియోలు పెట్టినా, ‘ఇంకా కలిసే ఉన్నారా? విడిపోలేదా?’ అంటూ కామెంట్లు పెడుతున్నారని సుమ అసహనం వ్యక్తం చేశారు. మొదట్లో బాధగా అనిపించినా, ఇప్పుడు వాటిని పట్టించుకోవడం లేదని, తమ వైవాహిక జీవితంలో ఉండే చిన్నపాటి మనస్పర్థలు చాలా సహజమని ఆమె స్పష్టం చేశారు.

 

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు