విశాలమైన నేత్రాలతో తెలుగు తెరపై ప్రత్యేకతను చాటుకున్న నాయిక భానుప్రియ కుటుంబ నేపథ్యాన్ని దర్శకుడు నందం హరిశ్చంద్రరావు ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. భానుప్రియ అసలు పేరు మంగభాను. ఆమెకి శాంతి అనే చెల్లెలు, గోపాలకృష్ణ అనే అన్నయ్య ఉన్నారు. ఆమె తండ్రి ఒక సాధారణ టైలర్. ఆయన మొదట వారికి సహాయం చేస్తూ, ఆ తరువాత మెరుగైన అవకాశాల కోసం మద్రాస్‌కు మకాం మార్చి, సినిమా కంపెనీలలో టైలర్‌గా పనిచేయడం ప్రారంభించారు.
భానుప్రియ తల్లికి ఆమెను హీరోయిన్‌ను చేయాలనే బలమైన కోరిక ఉండేది. ఆ ప్రోత్సాహంతోనే ఆమె నాట్యం నేర్చుకుంటూ, నటన వైపు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అలా భానుప్రియ తమిళ సినిమా ద్వారా సినీ రంగంలోకి అడుగుపెట్టారు. తెలుగులో ‘సితార’, ‘అన్వేషణ’, ‘ప్రేమించు పెళ్లాడు’ వంటి చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్నారు. ఒకానొక సమయంలో ఆమె విజయశాంతి, రాధ వంటి నాయికలతో పోటీపడుతూ, అగ్ర కథానాయకులైన చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, నాగార్జునలతో కలిసి నటించారు.
ఈ క్రమంలోనే భానుప్రియను దర్శకుడు వంశీ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అయితే, వంశీకి అప్పటికే పెళ్లి అయిన కారణంగా భానుప్రియ తల్లి ఆ పెళ్లికి అంగీకరించలేదు, దాంతో భానుప్రియ ఆ ఆలోచనను విరమించుకున్నారు. ఆ తరువాత ‘స్వర్ణకమలం’ సినిమాతో భానుప్రియ రేంజ్ పూర్తిగా మారిపోయింది. కథానాయికగా ఒక వెలుగు వెలిగిన ఆమె, తరువాత కాలంలో కేరక్టర్ ఆర్టిస్టుగా కూడా తన ప్రయాణాన్ని కొనసాగించారు.









