టాలీవుడ్ చరిత్రలో కల్ట్ క్లాసిక్‌గా నిలిచి, సరికొత్త ట్రెండ్‌ను సృష్టించిన చిత్రం ‘శివ’. 1989లో విడుదలైన ఈ సినిమా దర్శకుడిగా రామ్ గోపాల్ వర్మను పరిచయం చేయడమే కాక, హీరో నాగార్జున కెరీర్‌కు ఒక గొప్ప మలుపునిచ్చింది. ఈ సినిమా నవంబర్ 14న మళ్లీ రీ-రిలీజ్ కానున్న నేపథ్యంలో, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఒక ఇంటర్వ్యూలో ఆనాటి విశేషాలను పంచుకున్నారు. ‘శివ’ పూర్తయ్యే క్రమంలో ఎన్నో సమస్యలు, అడ్డంకులు ఎదురయ్యాయని, అయితే వాటిని దాటుకుంటూ సినిమాను పూర్తి చేయడం తన జీవితంలో మర్చిపోలేని అనుభవమని ఆర్జీవీ తెలిపారు.
‘శివ’ సినిమాను తన చేతుల్లోంచి జారిపోకుండా ఉండడానికి తాను ఎంతగానో కృషి చేశానని వర్మ వెల్లడించారు. నాగార్జున ఈ సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ, ఆయన తండ్రి, దిగ్గజ నటుడు అక్కినేని నాగేశ్వరరావు (ఏఎన్నార్) గారిని ఒప్పించడం, అలాగే నిర్మాత వెంకట్ గారిని విశ్వాసంలోకి తీసుకోవడం చాలా అవసరమైంది. వారిని అర్థం చేసుకోవడం, తన ఆలోచనలపై వారికి నమ్మకం కలిగించడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశానన్నారు. అంతేకాకుండా, ఆ సమయంలో వారి వైపు నుంచి వేరే ప్రాజెక్టులు అడ్డుపడకుండా చూసుకోడానికి తాను చాలా మాయ చేయాల్సి వచ్చిందని ఆర్జీవీ తెలిపారు.
‘శివ’ ప్రాజెక్ట్ షూటింగ్ ప్రారంభమయ్యేంత వరకూ తాను సుమారు 1000 అబద్ధాలు ఆడవలసి వచ్చిందని, కొన్ని సందర్భాల్లో కొన్ని కుట్రలు కూడా చేయాల్సి వచ్చిందని రామ్ గోపాల్ వర్మ సంచలన విషయాన్ని బయటపెట్టారు. అయితే, చివరికి ఆ కష్టం ఫలించి, సినిమా విడుదలైన తర్వాత తాను దర్శకుడిగా నిలబడ్డానని అన్నారు. ‘శివ’ కేవలం ఒక యాక్షన్ సినిమా మాత్రమే కాదని, ఆనాటి యువతలో ఉన్న కోపం, తిరుగుబాటు మనస్తత్వాన్ని ఈ సినిమా చూపించడం వల్లే, 36 ఏళ్లు గడిచినా ఇప్పటికీ ప్రజల మనసుల్లో నిలిచిపోయిందని ఆయన వివరించారు.









