ప్రముఖ బాలీవుడ్ గాయకుడు, సంగీత దర్శకుడు సచిన్ సంఘ్వీపై లైంగిక దాడి కేసు నమోదైంది. ముంబైకి చెందిన ఓ మహిళా గాయని ఇచ్చిన ఫిర్యాదు మేరకు విలే పార్లే పోలీస్ స్టేషన్లో శుక్రవారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పెళ్లి చేసుకుంటానని వాగ్దానం చేసి, కెరీర్లో సహాయం చేస్తానని చెప్పి తనను శారీరకంగా, మానసికంగా వేధించాడని బాధితురాలు ఆరోపించింది.
పోలీసుల వివరాల ప్రకారం, బాధితురాలు, సచిన్ సంఘ్వీకి గతేడాది సోషల్ మీడియా ద్వారా పరిచయం ఏర్పడింది. 2024 ఫిబ్రవరి నుంచి 2025 జూలై వరకు తామిద్దరూ సంబంధంలో ఉన్నామని, ఈ సమయంలోనే సచిన్ తనను తీవ్రంగా వేధించాడని ఆమె పేర్కొన్నారు. పెళ్లి ప్రస్తావన తీసుకురాగానే సచిన్ దూరం పెట్టడం ప్రారంభించాడని, అంతేకాకుండా బలవంతంగా తనకు అబార్షన్ చేయించాడని, తమ బంధం గురించి బయటపెడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించాడని బాధితురాలు తన ఫిర్యాదులో ఆరోపించారు.
ఈ ఆరోపణలను సచిన్ సంఘ్వీ తరఫు న్యాయవాది ఆదిత్య మిథే పూర్తిగా ఖండించారు. తన క్లయింట్‌పై చేసిన ఆరోపణలు నిరాధారమైనవని, ఈ కేసులో ఎలాంటి నిజం లేదని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సచిన్‌ను చట్టవిరుద్ధంగా నిర్బంధించిన తర్వాత బెయిల్‌పై విడుదల చేశారని, అన్ని ఆరోపణలను కోర్టులో సమర్థవంతంగా తిప్పికొడతామని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉంది, పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.









