టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తన వ్యక్తిగత జీవితం మరియు విడాకుల గురించి మరోసారి స్పందించింది. తన జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నానని చెబుతూ, తాను విడాకులు తీసుకున్నప్పుడు కొంతమంది వ్యక్తులు సంబరాలు చేసుకున్నారని, తన భవిష్యత్తు గురించి తీర్పులు ఇచ్చారని సమంత మనసులోని మాటను వెల్లడించింది. “నా జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను. నన్ను ద్వేషించే వాళ్లు నా దుస్థితిని చూసి నవ్వుకున్నారు. ముఖ్యంగా నేను విడాకులు తీసుకున్నప్పుడు వారు సంబరాలు చేసుకున్నారు. నా జీవితంపై వారే తీర్పు చెప్పేశారు. కానీ ఇప్పుడు నేను ఎవరినీ పట్టించుకోకుండా నా పని నేను చేసుకుంటున్నాను. నా ధైర్యమే నాకు బలం ఇస్తుంది” అని సమంత భావోద్వేగానికి లోనైంది.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అగ్రనటిగా ఎదిగిన సమంత, నటుడు అక్కినేని నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ, కేవలం నాలుగేళ్లకే విడాకులు తీసుకోవడం అభిమానులను, సినీ వర్గాలను షాక్‌కు గురిచేసింది. విడాకుల తర్వాత ఆమె తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నప్పటికీ, ధైర్యంగా ముందుకు సాగింది. అంతేకాకుండా, ఒక దశలో మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడి, విదేశాల్లో చికిత్స తీసుకుని ఆ వ్యాధిని జయించి తిరిగి జీవితాన్ని సానుకూలంగా మార్చుకుంది. తాజా ఇంటర్వ్యూలో తన మనసులోని మాటల్ని, విడాకుల సమయంలో తాను ఎదుర్కొన్న ప్రతికూల పరిస్థితుల గురించి చెబుతూ భావోద్వేగానికి గురైంది.
ప్రస్తుతం సమంత నటిగా, నిర్మాతగా చురుగ్గా దూసుకుపోతోంది. ఆమె నిర్మాతగా స్థాపించిన ‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్’ ద్వారా ‘శుభం’ చిత్రంతో విజయం సాధించింది. ప్రస్తుతం తెలుగులో ‘మా ఇంటి బంగారం’, హిందీలో ‘రక్త బ్రహ్మాండ్ : ది బ్లడీ కింగ్డమ్’ వంటి ప్రాజెక్టుల్లో నటిస్తూ తిరిగి యాక్టివ్ అవుతోంది. అయితే, సమంత చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, ఆమె అభిమానులు ‘సమంత నిజమైన ఫైటర్’, ‘ఆమెను తొక్కేయాలని చూసిన వాళ్లందరికీ ఇదే సమాధానం’ అంటూ ఆమె కాన్ఫిడెన్స్‌ను కొనియాడుతున్నారు. ఇదే సమయంలో బాలీవుడ్ దర్శక నిర్మాత రాజ్ నిడిమోరుతో ఆమె పెళ్లి రూమర్లపై మాత్రం సమంత ఇంకా స్పందించలేదు.









