రవితేజ 75వ చిత్రం ‘మాస్ జాతర’ గురించి నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ, ఈ సినిమాలో మాస్ మహారాజా అభిమానులు కోరుకునే అంశాలన్నీ ఉన్నాయని తెలిపారు. అక్టోబర్ 31న విడుదల కానున్న ఈ సినిమాపై ఆయన పూర్తి నమ్మకాన్ని వ్యక్తం చేశారు. సినిమా మొదటి భాగం అంతా రవితేజ శైలి వెటకారం, వినోదంతో సాగుతుందని నాగవంశీ వివరించారు.
సినిమాలోని ముఖ్యమైన అంశాల గురించి చెబుతూ, ప్రీ-ఇంటర్వెల్ నుండి క్లైమాక్స్ వరకు సినిమా అదిరిపోతుందని నాగవంశీ వెల్లడించారు. ఇంటర్వెల్‌కు సుమారు 20 నిమిషాల ముందు నుంచి, సెకండాఫ్ మొదలైన తర్వాత కొంత వినోదం, ఆ తర్వాత పాట నుంచి క్లైమాక్స్ లీడ్ వరకు దాదాపు గంటసేపు హై-ఇంటెన్సిటీ సినిమా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఆ గంటసేపూ, దానికి ముందు 20 నిమిషాలు “థియేటర్లు ఊగిపోతాయ్” అని, ఎమోషన్, యాక్షన్ బ్లాక్స్ అద్భుతంగా ఉంటాయని హామీ ఇచ్చారు.
నటకిరీటి డా. రాజేంద్ర ప్రసాద్ ఒక కీలక పాత్ర పోషించారని, ఆయన పాత్రకు సంబంధించిన ట్విస్ట్ క్లైమాక్స్ సన్నివేశంలో వస్తుందని కూడా నాగవంశీ చెప్పారు. రచయిత భాను భోగవరపు దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో రవితేజ సరసన శ్రీలీల నటించింది. రవితేజ ఇందులో రైల్వే పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. ఈ సినిమా ‘వింటేజ్ మాస్ మహారాజా’ను చూపించేలా తీశామని చిత్ర బృందం చెబుతోంది.









