దాదాపు రెండు దశాబ్దాల తర్వాత రవితేజ నటించిన ‘టైగర్ నాగేశ్వరరావు’ చిత్రంతో నటిగా రీఎంట్రీ ఇచ్చిన రేణూ దేశాయ్, ఆ సినిమా సమయంలో తనపై వచ్చిన విమర్శలపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేశారు. ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమా చేస్తున్నప్పుడు కొందరు “కమ్‌బ్యాక్ ఇచ్చింది కాబట్టి ఇకపై అన్ని రకాల సినిమాల్లో నటిస్తుందని, ఎక్కడ చూసినా తనే కనిపిస్తుందని” రాశారని ఆమె గుర్తుచేసుకున్నారు. అయితే, ఆ సినిమా విడుదలై రెండేళ్లు అవుతున్నా తాను మరే సినిమాలోనూ నటించలేదని, ఏ ప్రాజెక్టుకూ సంతకం చేయలేదని రేణూ స్పష్టం చేశారు. నాడు విమర్శించిన వారు ఇప్పుడు వచ్చి క్షమాపణలు చెప్పరని, మాట్లాడేవారు ఎలాగైనా మాట్లాడతారని ఆమె అభిప్రాయపడ్డారు.
నటన అంటే తనకు చాలా ఇష్టమే అయినప్పటికీ, అదే తన జీవిత లక్ష్యం కాదని రేణూ దేశాయ్ స్పష్టం చేశారు. తాను డబ్బుకు అంత ప్రాధాన్యం ఇచ్చే మనిషిని కాదని పేర్కొన్నారు. “ఒకవేళ నటననే కెరీర్‌గా కొనసాగించి ఉంటే ఇప్పటికి మంచి పేరు సంపాదించేదాన్ని” అని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం తనకు మంచి పాత్రలు, మహిళా ప్రాధాన్యం ఉన్న కథలు వస్తున్నాయని ఆమె తెలిపారు. త్వరలోనే ఓ కామెడీ చిత్రంలో అత్త పాత్రలో నటించనున్నట్లు, అత్తాకోడళ్ల మధ్య హాస్యభరితంగా సాగే ఈ సినిమా త్వరలో ప్రారంభం కానుందని వెల్లడించారు.
తనకు ఆధ్యాత్మిక మార్గంపై ఆసక్తి ఎక్కువని, భవిష్యత్తులో సన్యాసం తీసుకునే అవకాశం కూడా ఉందని రేణూ దేశాయ్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి. నటన పట్ల ప్రేమ ఉన్నప్పటికీ, అది తన జీవితానికి అంతిమ లక్ష్యం కాదనే ఆమె అభిప్రాయం, భవిష్యత్తులో ఆమె ఆధ్యాత్మిక మార్గం వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని పరోక్షంగా సూచించింది.









