తన ప్రత్యేకమైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకుల్లో మంచి స్థానాన్ని సంపాదించుకున్న నవీన్ పోలిశెట్టి, మరో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘అనగనగా ఒక రాజు’ (Anaganaga Oka Raju) తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి విడుదలైన దీపావళి ప్రత్యేక ప్రోమో, నవ్వుల టపాసులను తలపిస్తూ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ ప్రోమో 2026 సంక్రాంతికి ప్రేక్షకులకు నవ్వులతో నిండిన అసలైన పండుగను అందిస్తామని హామీ ఇచ్చింది. నవీన్ అద్భుతమైన హాస్య చతురత, సహజమైన ఆకర్షణ ప్రతి ఫ్రేమ్‌లో ప్రకాశించాయి, తెరపై ఆయన ఉత్సాహం ప్రేక్షకులను కట్టిపడేసింది.
రెండు నిమిషాల ఇరవై ఎనిమిది సెకన్ల నిడివితో రూపొందించిన ఈ దీపావళి ప్రోమో సినిమాపై అంచనాలను అమాంతం పెంచింది. కొద్దిమంది మాత్రమే ఇంతటి వినోదాన్ని నిమిషాల్లో అందించగలరని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. వారు దీనిని “ఒక నవ్వుల అల్లరి,” “వినోదాల విందు,” మరియు “అసలైన పండుగ సినిమా” అని అభివర్ణిస్తున్నారు. హాస్యం, తాజాదనంతో కూడిన కథలను ఎంచుకోవడంలో నవీన్ మరోసారి తన నైపుణ్యాన్ని ఈ ప్రోమో ద్వారా నిరూపించుకున్నారు. ప్రేక్షకుల్లో మరింత ఉత్సాహాన్ని పెంచడానికి, ఈ భారీ అంచనాలున్న చిత్రం నుండి మొదటి గీతం త్వరలో విడుదల కానుంది.
శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో మారి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు, మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రం 2026 జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. తాజాగా విడుదలైన ఈ దీపావళి ప్రోమో, ‘అనగనగా ఒక రాజు’ చిత్రాన్ని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లలో ఒకటిగా నిలిపింది.









