టాలీవుడ్ ఇండస్ట్రీకి ‘మెహబూబా’ సినిమా ద్వారా అడుగుపెట్టిన నేహా శెట్టి (Neha Shetty), కెరీర్ ఆరంభం నుంచీ ఒడిదొడుకులను ఎదుర్కొంటూ వచ్చింది. సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన సూపర్ హిట్ చిత్రం ‘డీజే టిల్లు’లో ‘రాధిక’ పాత్ర పోషించడం ద్వారా ఆమె ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించగలిగింది. ఆ సినిమా భారీ విజయం సాధించడంతో పాటు, రాధిక పాత్ర ఇప్పటికీ చర్చనీయాంశంగా ఉంది. సాధారణంగా మాస్ ఆడియన్స్‌లో మంచి ఆదరణ ఉన్న సిద్దు జొన్నలగడ్డ సినిమాల ద్వారా ఈ భామకు మంచి బ్రేక్ లభిస్తుందని అందరూ అంచనా వేశారు.
అయితే, డీజే టిల్లుతో పాటు ‘టిల్లు స్క్వేర్’ సినిమాలో నటించినప్పటికీ, నేహాకు పెద్ద బ్రేక్ దక్కలేదు. విశ్వక్ సేన్‌తో కలిసి నటించిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ చిత్రంలో నటనకు ప్రశంసలు దక్కినా, పెద్ద ఆఫర్లు రాకపోవడం అభిమానులను నిరాశపరిచింది. ఇదే క్రమంలో, కోలీవుడ్‌లో ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన ‘డ్యూడ్’ సినిమాలో ఆమెకు అవకాశం లభించింది. ఈ చిత్రంతో కోలీవుడ్‌లో కెరీర్ ఊపందుకుంటుందని భావించినా, సినిమా విడుదల తర్వాత నేహా పాత్ర గురించి పెద్దగా చర్చ జరగలేదు. ఆమెది చిన్న గెస్ట్ రోల్ అని, ప్రేక్షకులను ఆకర్షించలేకపోయిందని ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
‘డ్యూడ్’ సినిమాలో హీరోయిన్ మమిత బైజు, ప్రదీప్ పాత్రలకు ఎక్కువ గుర్తింపు రావడంతో, నేహా శెట్టి పాత్రకు తగిన అటెన్షన్ రాలేదు. దీనికి ముందు, ఆమె ‘ఓజీ’ సినిమాలో చేసిన ఐటం సాంగ్ కూడా ఆమె కెరీర్‌కి పెద్దగా ఊతం ఇవ్వలేదని అభిమానులు అంటున్నారు. నేహా తన అందం, ప్రతిభకు తగిన ఆఫర్లను మాత్రమే ఎంచుకోవాలని, చిన్న గెస్ట్ రోల్స్‌కు ‘నో’ చెప్పాలని అభిమానులు సూచిస్తున్నారు. ఆమెకు మరిన్ని మంచి అవకాశాలు రావాలంటే పక్కా ప్లాన్‌తో ముందుకు వెళ్లాలని వారు ఆశిస్తున్నారు.









